గొల్లభామపై సుక్కు ఇచ్చిన క్లారిటీ

Update: 2018-03-15 14:37 GMT
ఓ సినిమా వస్తోందంటే.. దానిపై వివాదాలు రావడం కూడా కామన్ అయిపోయింది. ఒక పాయింట్ నో.. ఓ పదాన్నో.. ఓ వాక్యాన్నో పట్టుకుని మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో విడుదల కానున్న రాంచరణ్ మూవీ రంగస్థలం విషయంలో కూడా ఇప్పటికే గొల్లభామ వివాదం ముదురుతోంది.

గొల్లభామ వచ్చి నో గోరు గిచ్చుతుంటే.. అంటూ రంగస్థలం మూవీలోని రంగమ్మా మంగమ్మా పాటలో ఓ చరణం ఉంది. ఈ పాట కారణంగా తమ మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని.. వారిని అవమానించేలా ఉందంటున్న యాదవులు.. ఆ పదాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. దీంతో ఈ అంశంపై దర్శకుడు సుకమార్ స్పందించాడు. తాము ఎవరినీ అవమానించేలా రీతిలో పాటను తీయలేదని స్పష్టం చేశాడు. అయినా.. ఆ చరణంలో వినిపిస్తున్న గొల్లభామకు అర్ధం.. వారు తీసుకున్నది కాదని తేల్చేశాడు ఇంటెలిజెంట్ డైరెక్టర్.

గొల్లభామ అంటే ఓ గ్రాస్ హాపర్(మిడత) అని.. అది కుట్టడం అనే అర్ధంతోనే ఆ పాట రాయడం జరిగిందని.. ఆ విషయం అర్ధం చేసుకోకుండా.. ఎవరికి తోచిన రీతిలో వారు అర్ధాలు తీసుకోవడం సరికాదని హితవు పలికాడు సుకుమార్. మరి దర్శకుడి నుంచి వచ్చిన ఈ క్లారిటీ చూస్తుంటే.. గొల్లభామ అనే పదంపై రంగస్థలం టీమ్ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదని అనిపించక మానదు.
Tags:    

Similar News