తగ్గేదేలే.. హరీష్ శంకర్‌ vs బీవీఎస్ రవి ట్వీట్ వార్..!

Update: 2022-02-04 08:47 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులు - దర్శకులు సాంకేతిక నిపుణుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. ఎప్పుడూ అవి బయటకు చూపించకుండా ఐకమత్యంగా ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఏవైనా విభేదాలు ఉన్నా వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటారు కానీ.. పబ్లిక్‌ గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. అయితే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే ఇద్దరు దర్శకరచయితలు హరీష్ శంకర్‌ - బీవీఎస్ రవి మధ్య ఈరోజు జరిగిన ఆసక్తికరమైన ట్వీట్ వార్ అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. ''అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది'' అని బీవీఎస్ రవి ఓ ట్వీట్ పెట్టారు. ఆయన ఎవరినీ ప్రస్తావించనప్పటికీ ప్రస్తుత పరిస్థితులను బట్టి బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించిందని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. అయితే రవి ట్వీట్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందిస్తూ.. ''అనుభవించమని ఇచ్చారా ??'' అని ప్రశ్నిస్తూ దండం పెడుతున్న ఎమోజీ పోస్ట్ చేసారు. దీనికి ''దయచేసి సెటైర్ ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్స్ యూ" అని రవి రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరూ తగ్గేదేలే అంటూ ట్వీట్స్ చేసుకున్నారు.

ఇందులో ఏమాత్రం వెనక్కి తగ్గని హరీష్.. ''మీరు సెటైర్ అని వివరిస్తున్నప్పటికీ అది సెటైర్ కాదు.. గెట్‌ వెల్‌ సూన్'' అని  బదులిచ్చారు. దీనికి రవి స్పందిస్తూ.. ''కొన్ని సమయాల్లో ఇతర స్టేట్‌మెంట్‌ లపై స్టేట్‌మెంట్ ఇవ్వడం అనేది ఉనికి కోసం పోరాటంలో క్లిష్టమైన పరిస్థితి నుండి వచ్చిన ప్రకటనగా ప్రతిధ్వనిస్తుంది. ఆల్ ది బెస్ట్. సోషల్ మీడియా ప్రజాస్వామ్యంలో ప్రయాణం కొనసాగించండి'' అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో మరో ట్వీట్ చేసి దాన్ని డిలీట్ చేసారు.

హరీష్ శంకర్ దాన్ని రీట్వీట్ చేస్తూ ''ఈ మేటర్ లో నాకు వాట్సాప్ అక్కర్లేదు బావా.. పది మందిలో కూడా సంస్కారవంతంగా మాట్లాడ్డం “నాకు” వచ్చు. నేను చెప్పినట్లు నువ్వు అన్ స్టాపబుల్.. దయచేసి కంటిన్యూ చేయండి!!!'' అని అన్నారు. దీనికి బీవీఎస్ స్పందిస్తూ..''సంస్కారం గురించి నువ్వు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. బహుశా మొదటి సారి అనుకుంటా కదా'' అని బదులిచ్చారు. ''అంతేగా మరి. ఉన్నదాని గురించి ఎక్కువ మాట్లాడను. లేనివాళ్ళ దగ్గర చెప్పడానికి తడబడను. బాగా వెళ్తున్నావ్ బావా.. ప్లీజ్ కంటిన్యూ .. నా వీకెండ్ సరదాగా గడుపుతున్నాను.. కానీ నా తీరిక సమయంలో మాత్రమే సమాధానం ఇస్తాను. రిప్లై లేట్ అయితే అయ్యి మళ్ళీ ఫీల్ అయ్యి అందరి దగ్గర ఏడవకు'' అని హరీష్ ట్వీట్ పెట్టాడు.

దీనికి కొనసాగింపుగా రవి ''ఏడవడానికి కూడా ఎవడు లేని ఒంటరితనం ఉంటేనే సోషల్ మీడియా అరుగు మీద కూర్చుని ఏడవలేక నవ్వుకునే వాళ్ళని చూస్తే నవ్వొస్తోంది. ఇట్లు భవదీయుడు బీవీఎస్ రవి'' అని వ్యంగ్యంగా అన్నారు. ''ట్వీట్స్ డిలీట్ చేసే పిరికితనం కన్నా.. ఒంటరితనం బెటర్ ఏమో కదా బావా!!! ఓ మై గాడ్. ఏది ఏమైనా నీతో నా ఫ్లో సూపర్ బావా. నీ నెక్స్ట్ ట్వీట్ కోసం వేచి చూస్తున్నా. కమాన్. నువ్ చెయ్యగలవ్. అంటే నువ్వు ట్వీట్ చేయగలవు'' అని రవికి హరీష్ శంకర్ కౌంటర్ ఇచ్చారు.

''సరిచేసుకుపోవడం పిరికితనం అయితే సాగతీసుకోవడం చావకబారుతనం. సూపర్ కదా పంచ్. నీతో అదే ఫెసిలిటీ. నీ మొహం చూస్తే పంచ్ పడిపోతుంది. పర్మిషన్ ఇస్తే భవదీయుడు భగత్ సింగ్ షూట్ లో కలుద్దాం'' అని బీవీఎస్ ట్వీట్ పెట్టారు. దీనికి హరీష్ ''పర్మిషన్ ఇస్తే కాదు బావా.. ఆడిషన్ ఇస్తే రావొచ్చు. ఈ మధ్య 'వేషాలేస్తున్నావ్' కదా రవి'' అని సెటైర్ వేశారు. ''ఏది ఉంటే దానికి వస్తాలే.. అది వుంటే ఇదీ ఉంటది. ఇది ఉంటే అది ఎలాగూ ఉంటుంది'' అని పరోక్షంగా హరీష్ ను ఉద్దేశిస్తూ రవి రిప్లై ఇచ్చారు. ''ఇందాకే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ మాటే  హైలైట్. వాడికెలాగో..'' అని మరో ట్వీట్ చేశారు.

గతంలో బీవీఎస్ రవి చేసిన ''ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక  వెళ్లి పెవిలియన్ కూర్చోవాలి.. నేను అలా కొట్టాలనుకోలేదు ఇలా అనుకున్నా అని గ్రౌండ్ లో డిస్కషన్స్ పెట్టొద్దు'' అనే ట్వీట్ ని కోట్ చేసిన హరీష్ శంకర్.. ''LOL.. ఇది షో మాత్రమే కాదు.. మీ చాలా లక్షణాలు అన్ స్టాపబుల్ గా ఉన్నాయి బావా.. ప్లీజ్ కంటిన్యూ రవి'' అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రవి తన ఫస్ట్ ట్వీట్ ని ప్రస్తావిస్తూ.. ''అనుభవించడంలో ఒక భాగం పరిపాలన, ఇంకొంచమే భాగం ప్రజా సేవ. ఎవరు వచ్చినా చేస్తే అనుభవించడమే. (కింద నా ట్వీట్ చదివిన వారి కోసం. విశాఖదత్తుడు విరచిత "ముద్రారాక్షసమ్" లో చంద్ర గుప్తాతో చంకయ్య ఇలా చెప్పాడు) '' అని పేర్కొన్నారు.

దర్శకుల మధ్య ట్వీట్ వార్ కావాల్సినంత ఎంటెర్టైన్మెంట్ ఇచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ వస్తున్నాయి. వారికి నిజంగా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా? లేక కేవలం అభిప్రాయ భేదాలేనా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్ వార్ కి హరీష్ శంకర్ - బీవీఎస్ రవి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా లేదా కొనసాగిస్తారా అనేది చూడాలి.
Tags:    

Similar News