జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో సోషల్ మీడియా వెర్బల్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఏదోలా ఆ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో....శ్రీరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి పవన్ పై మహేష్ మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఆ తర్వాత మహేష్ పై ఓ యువతి చేసిన ఆరోపణలను ఎత్తిచూపుతో ఆయనను పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ ట్విట్టర్ ఖాతాపై పవన్ ఫ్యాన్స్ ఫిర్యాదు చేయడం...ఆ ఖాతా బ్లాక్ అవడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ గురించి, కాస్టింగ్ కౌచ్ పై నటుడు, రచయిత హర్షవర్దన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ చాలా తెలివైనోడు అని, అతడిని జనసేన పార్టీలో చేర్చుకుంటే లాభమని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన లోకి మహేష్ వస్తే రూరల్ డెవలపింగ్, అండర్ డెవలపింగ్ వంటివి అద్భుతంగా చేస్తాడని కితాబిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను పవన్ ఫ్యాన్స్ అపార్థం చేసుకోవద్దని కూడా హర్ష చెప్పారు. ఓ యూట్యూబ్ చానెల్ కు హర్ష ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రూఫులు లేనపుడు ఎవరి మీద ఆరోపణలు చేయకూడదని, అలా చేస్తే తిరిగి మన పీకలకే చుట్టుకుంటుందని హర్ష అన్నారు. మహేష్ పై ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హర్ష ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాంక ట్రంప్ వచ్చినందుకు రోడ్లు బాగు పడ్డాయంటే తాను హ్యాపీగా ఫీలవుతానని అన్నారు. పవన్ కు ఉన్న మంచితనం ఎప్పుడో ఓసారి ప్రూవ్ చేసుకుంటాడని అన్నారు.దిలీప్ కళ్యాణ్ సుంకర మహాద్భుతమైన వ్యక్తి అని పవన్ తో చెప్పాలని ఉందని అన్నారు. పవన్ ఫ్యాన్స్ తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, మహేష్ కత్తిని కూడా పార్టీలో పెట్టుకుందాం అని ఆయనతో చెప్పాలని ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేష్ బాగా చదువుకొని లా పాయింట్స్ తెలిసినోడని, మొండి మనిషని ...అతడు మంచివాడా? చెడ్డవాడా? అన్నది వేరే విషయమని అన్నారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు క్రేజ్ ఎక్కువని, ప్రత్యర్థి బలంగా ఉంటే మనకే మంచిదని హర్ష చెప్పారు. మహేష్ ఎత్తి చూపే తప్పులను ఆటలో చూపించాలని....బాడీలైన్(వ్యక్తిగత దూషణ) చేయకూడదని అన్నారు. ఫలానా వాళ్లకు అన్యాయం జరుగుతోందని మహేష్ చెప్పిన వాళ్లకి న్యాయం చేస్తే మళ్లీ అతడు ఆ మాట అనడానికి చాన్స్ ఉండదని లాజిక్ చెప్పాడు హర్ష. మహేష్ తెలివైనోడంటే పవన్ అభిమానులకు కోపం వస్తుందని, కానీ తాను చెప్పిన విషయం కూల్ గా ఆలోచించాలని హర్ష అన్నారు.