నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ఉందా.. దీన్ని చదవాల్సిందే

Update: 2022-04-21 02:21 GMT
కరోనాకు ముందు నెట్ ఫ్లిక్స్ అన్న మాట తెలిసిన వారి కంటే తెలియని వారే ఎక్కువ. మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్ పరిచయం చేసిన వాటిల్లో నెట్ ఫ్లిక్స్ ముందుంటుంది. ఆ మాటకు వస్తే ఓటీటీ ప్లాట్ ఫాంలకు రాజయోగంలా లాక్ డౌన్ కాలం నడిచిందని చెప్పాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండి వినోదానికి ఏ మాత్రం కొదవ లేకుండా చేయటంలో ఓటీటీలు ముందున్నా.. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న కంటెంట్ బ్యాంక్ మామూలుగా ఉండదనే చెప్పాలి.

మిగిలిన ఓటీటీ ఫ్లాట్ ఫాంలతో పోలిస్తే.. నెట్ ఫ్లిక్స్ కాస్తంత ఖరీదైన వ్యవహారంగా చెప్పాలి. అయితే.. మిగిలిన ఓటీటీ ఫ్లాట్ ఫాంలు అనుసరిస్తున్న వ్యూహాలకు అనుగుణంగా ఈ మధ్యనే తన ధరల ప్యాకేజీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. భారత్ లో కొత్త తరహా వ్యూహానికి పదునుపెట్టి.. అందులో భాగంగా చందాదారుల నుంచి వసూలు చేసే వార్షిక ఫీజుల్లో కోత విధించారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి - మార్చిలో నెట్ ఫ్లిక్స్ చందాదారుల్లో 2 లక్షల మంది తగ్గినట్లుగా గుర్తించారు. దీనికి కారణం ఉక్రెయిన్ - రష్యాల మధ్య జరుగుతున్న యుద్దం కూడా కారణంగా భావిస్తున్నారు. గడిచిన పదేళ్లలో ఈ తరహా షాకింగ్ అనుభవం నెట్ ఫ్లిక్స్ కు తొలిసారి ఎదురైంది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కొత్తతరహాలో పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని తెర మీదకు తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అదే జరిగితే ఇప్పటివరకు చందాదారుడు తన అకౌంట్ పాస్ వర్డు వేరే వారికి సులువుగా బదిలీ చేయటం.. ఒక ఖాతా మీద పలువురు వినియోగించేందుకు వీల్లేకుండా చేయటం ప్రధానాంశంగా చెబుతున్నారు. అదే సమయంలో యాడ్స్ ను ఇస్తూ తక్కువ ధరలతో సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను తెచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్ - రష్యా మద్య యుద్ధం ఒక్క నెట్ ఫ్లిక్స్ మీద మాత్రమే కాదు.. యాపిల్.. వాల్ట్ డిస్నీ లాంటి సంస్థలతో పోటీ కూడా చందాదారుల సంఖ్య తగ్గటానికి కారణంగా చెబుతున్నారు. అంతేకాదు.. రష్యా చేస్తున్న యుద్దం నేపథ్యంలో ఆ దేశంలో తమ సేవల్ని నిలిపివేసిన కారణంగా 7 లక్షల మంది ఖాతాదారుల్ని కోల్పోయింది.

నెట్ ఫిక్లిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా 22.16 కోట్ల మంది చందాదారులు ఉంటే.. రానున్న మూడు నెలల్లో మరో 20 లక్షల మందిని కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నష్టపరిహారాన్ని తగ్గిచేందుకు కొత్త వ్యూహాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఇదిలా ఉండగా చందాదారుల్ని కోల్పోతున్న వేళ.. నెట్ ఫ్లిక్స్ షేర్ వాల్యూ దారుణంగా పడిపోయిన పరిస్థితి.

గడిచిన నాలుగు నెలల్లో 36 శాతం పడిపోయింది. మరో లెక్క ప్రకారం చూస్తే.. ఆదాయం పెరగాల్సినంత పెరగకపోగా.. తగ్గటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. షేర్ ధర పడిపోవటంతోనెట్ ఫ్లిక్స్ వాటాదారుల సంపద దాదాపు రూ.11.25 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. ఇంతకు మించిన పెద్ద దెబ్బ పడినప్పుడు కొత్త తరహా ఆలోచనలు చేయటం ఖాయం. అదే బాటలో నెట్ ఫ్లిక్స్ నడుస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News