పవన్ సీఎం అయితే గర్విస్తాను: మురళీమోహన్

Update: 2022-07-19 00:30 GMT
మురళీమోహన్ .. 70వ దశకంలో తెలుగు తెరకి పరిచయమైన కథానాయకులలో ఆయన ఒకరు. అప్పటికి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లు రంగంలో ఉన్నారు. కృష్ణ - శోభన్ బాబు - కృష్ణంరాజు ఎవరి దారిలో వాళ్లు దూసుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో హీరో కావాలనే ఆలోచన చేయడం కూడా ఒక సాహసం లాంటిదే. అలాంటి సాహసం చేసిన నటుడు మురళీమోహన్. హీరోగా కొన్ని సినిమాలు చేసిన మురళీమోహన్ ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు.

ఆ తరువాత ఆయన వరుస సినిమాలతో బిజీ అయ్యారు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించి భారీ విజయాలను  అందుకున్నారు. ఆ తరువాత రాజకీయాల దిశగా అడుగులువేసి. తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్రను పోషించారు.

కొంతకాలంగా ఆయన క్రియాశీలక రాజకీయలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సినిమాలలో ఏదైనా ముఖ్యమైన పాత్ర వస్తే చేస్తున్నారు. దాదాపుగా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఆయన పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకుని రావడం .. ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది.

తాజా ఇంటర్వ్యూలో మురళీమోహన్ మాట్లాడుతూ .. "మొదటి నుంచి కూడా నాకు చిరంజీవితో ఎక్కువ స్నేహం ఉండేది. పవన్ కల్యాణ్ తో పెద్దగా మాట్లాడింది లేదు. ఆయన రాజకీయలలోకి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ వస్తున్నవాడిని. సాధారణంగా రాజకీయాలలోకి వచ్చినవాళ్లలో.. తమ వలన కాదనుకుని మధ్యలో వెళ్ళిపోయినవారు ఎక్కువగా ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ అలా కనిపించడం లేదు .. ప్రజల తరఫున నిలబడి పోరాడుతుండటం గొప్ప విషయం. ఆయనలో నాకు నచ్చింది కూడా అదే.

తనని నమ్మిన ప్రజల తరఫున పవన్ పోరాడుతున్నారు .. తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం నిలబడుతున్నారు. ఇదే ఉత్సాహంతో ఆయన ముందుకు వెళితే గొప్ప స్థాయికి వెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది నేను చెప్పలేనుగానీ .. అయితే మాత్రం గర్వపడతాను.

మా సినిమా నుంచి మరొకరు ముఖ్యమంత్రి అయ్యారని సంతోషపడతాను" అంటూ చెప్పుకొచ్చారు. పవన్ గురించి మురళీ మోహన్ ఇలా మాట్లాడటం ఇటు సినీ వర్గాల్లో .. అటు రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.
Tags:    

Similar News