ఈసారి హిట్టు కొట్టకపోతే కష్టమేనా..?

Update: 2022-07-26 03:58 GMT
నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మూడో తరం వారసుడు కళ్యాణ్ రామ్.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించలేకపోయాడనే చెప్పాలి. ఫస్ట్ సినిమా 'తొలి చూపులోనే' నుంచి చివరి చిత్రం 'ఎంతమంచి వాడవురా' వరకు గమనిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ లో హోమ్ ప్రొడక్షన్ లో చేసిన 'అతనొక్కడే' & 'పటాస్' సినిమాలను మాత్రమే మంచి కమర్షియల్ విజయాలుగా పరిగణించవచ్చు. నిజానికి నందమూరి హీరో మొదటి నుంచీ కూడా వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు.

ఓవైపు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరోవైపు రెగ్యులర్ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లలో నటించాడు. ఎలాంటి సినిమా చేసినా ఆశించిన ఫలితమైతే దక్కకుండా పోయింది. దీంతో 'ఎంతమంచి వాడవురా' సినిమా పరాజయం పాలైన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ''బింబిసార''వంటి సోషియో ఫాంటసీ యాక్షన్ మూవీతో వస్తున్నాడు.

'బింబిసార' అనేది ఒక టైం ట్రావెల్ మూవీ. విజువల్ ఎఫెక్ట్స్ - భారీ సెట్స్ తో అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందిన సినిమా. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్ లో ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు చేశారు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన సినిమా అని చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెట్టుబడిని తిరిగి రాబట్టగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

మల్లిడి వశిష్ఠ్ అనే నూతన దర్శకుడు 'బింబిసార' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ కు ఇంకా తొమ్మిది రోజులే ఉన్నా సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ అవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'బింబిసార' ట్రైలర్ ని బట్టి కళ్యాణ్ రామ్ కాకుండా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మేజర్ రోల్ ప్లే చేశాయని తెలుస్తుంది. కాకపోతే జనాలను థియేటర్లకు రప్పించడానికి ఇవి మాత్రమే సరిపోవు. ఇప్పటి వరకు వచ్చిన రెండు పాటలు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి సంచలనాన్ని రేకెత్తించలేదు.

అగ్ర దర్శకుడు మరియు స్టార్ హీరోయిన్ లేరు కాబట్టి కళ్యాణ్ రామ్ ఒక్కడే సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ప్రమోషన్స్ కూడా అతనొక్కడే చేస్తున్నాడు. విడుదల దగ్గర పడుతుండటంతో కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. సినిమాకు బజ్ తీసుకురావడానికి ఇవి సరిపోవు.

ఇటీవల కాలంలో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది వాస్తవం. వారిని సినిమా హాళ్లకు రప్పించాలంటే ఎగ్జైట్ చేసే ప్రమోషనల్ కంటెంట్ తో పాటుగా దూకుడుగా ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.

అందులోనూ 'బింబిసార' కి సోలో రిలీజ్ డేట్ దొరకలేదు. వైజయంతీ మూవీస్ లో రూపొందిన 'సీతా రామం' సినిమా అదే రోజున విడుదల కాబోతోంది. రెండు భిన్నమైన జోనర్స్ అయినా పోటీ అనేది కచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఏదైనా స్పెషల్ ప్రమోషన్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది.

ఏదేమైనా 'బింబిసార' సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. కంటెంట్ ను నమ్మి భారీగా ఖర్చు చేశారు. ఇది సూపర్ హిట్ అవ్వడం నందమూరి హీరో కెరీర్ కి చాలా అవసరం. అన్న కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగబోతున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టుగా హాజరై తనవంతు సపోర్ట్ చేయనున్నారని సమాచారం.

'బింబిసార' సినిమాలో కేథరిన్ థ్రెసా - 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ - వారీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
Tags:    

Similar News