రొటీన్ ఫార్ములా త‌మిళ‌ స్టార్స్ ని ముంచేస్తోందా?

Update: 2022-04-15 01:30 GMT
ప్ర‌స్తుతం సినిమాలు తీసే వాళ్ల‌ కంటే సినిమాలు చూసే ప్రేక్ష‌కులే చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు. ఎక్క‌డ చిన్ని కాపీ సీన్ క‌నిపించినా దాన్ని ఎక్క‌డి నుంచి లేపేశారో వెంట‌నే గుర్తు ప‌ట్టేసి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. పాయింట్ టు పాయింట్ ఎక్క‌డి నుంచి లేపేశారో వివ‌రంగా రివ్యూ చేస్తున్నారు. దీంతో మేక‌ర్స్ చాలా జాగ్ర‌త్త‌గా సినిమా క‌థ‌ల్ని సిద్ధం చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఇక సినిమా రిజ‌ల్ట్ ని కూడా ఆడియ‌న్స్ ఫ‌స్ట్ షోతోనే తేల్చేస్తున్నారు. ఇది డిజాస్ట‌రా?  లేక బ్లాక్ బ‌స్ట‌రా.. లేక మూస క‌థ‌తో చేసినా సినిమానా అని క్ష‌ణాల్లో ప‌ట్టేస్తున్నారు.

ప్రేక్ష‌కులు ఇంత షార్ప్ గా వున్నా కొంత మంది త‌మిళ స్టార్స్ మాత్రం ఇప్ప‌టికీ మూస క‌థ‌ల్నే న‌మ్ముకుని సినిమాలు చేస్తూ అడ్డంగా బుక్ అవుతుండ‌టం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల త‌మిళ స్టార్ హీరోలు మూస క‌థ‌ల్ని న‌మ్ముకుని భారీ బ‌డ్జెట్ తో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డాయి. వీటి వ‌ల్ల స‌ద‌రు హీరోల క్రేజ్ ని న‌మ్మ భారీ మొత్తాల‌కు సొంతం చేసుకున్న డిస్ట్రి బ్యూట‌ర్లు భారీ న‌ష్టాల‌ని చ‌విచూడాల్సి వ‌చ్చింది.

అంతే కాకుండా స్టార్స్ కూడా మారుతున్న కాలాన్ని బ‌ట్టి మార‌కుండా రోటీన్ రొడ్డ‌కొట్టుడు సినిమాలు చేయ‌డంతో భారీ అంచ‌నాల‌తో థియేట‌ర్ల‌కు వ‌స్తున్న ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌పై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తూ త‌గ‌ల‌బెట్టేస్తుండ‌టం ప‌లువురిని క‌ల‌వరానికి గురిచేస్తోంది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన భారీ చిత్రం 'అన్నాత్తే'... 'శిరుతై' శివ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మారన్ నిర్మించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం మూస క‌థ కావ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి ర‌జ‌నీ ఫ్యాన్స్ ని నిరాశ‌ప‌రిచింది.

ఆ త‌రువాత త‌ల అజిత్ న‌టించిన 'వ‌లిమై' విడుద‌లైంది. ఈ చిత్రాన్ని బోనీ క‌పూర్ నిర్మించారు. 'నేర్కొండ పార్వై' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన కాంబినేష‌న్ కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తెలుగు హీరో కార్తికేయ స్టైలిష్ విల‌న్ గా త‌మిళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన సినిమా కావ‌డంతో తెలుగులోనూ ఆస‌క్తి ఏర్ప‌డింది. హెచ్‌. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని కంప్లీట్ రేస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు. ఇదే ఈ సినిమాకు బిగ్ మైన‌స్ గా మారింది. క‌థ లేకుండా యాక్ష‌న్ సీన్ ల‌తో కానిచ్చేయాల‌ని చూస్తే ఇంట‌లిజెంట్ ఆడియ‌న్స్ గ‌ట్టి షాకిచ్చారు. త‌మిళంలో అజిత్ స్టార్ ఇమేజ్ కొంత వ‌ర‌కు ఈ సినిమాని కాపాడే ప్ర‌య‌త్నం చేసినా మిగ‌తా భాష‌ల్లో మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.

ఇదే వ‌రుస‌లో సూర్య న‌టించిన చిత్రం 'ఈటీ' (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) విడుద‌లైంది. బ్యాక్ టు బ్యాక్ 'ఆకాశ‌మే నీ హ‌ద్దురా', 'జై భీమ్‌' వంటి చిత్రాల‌ని ఓటీటీలో విడుద‌ల చేసి సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్న సూర్య కొంత విరామం త‌రువాత 'ఈటీ' సినిమాతో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయాల‌నుకున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వైఫ‌ల్యాన్ని చ‌విచూసింది. సూర్య భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ అభిమానుల‌తో పాటు స‌గ‌టు సినీ ల‌వ‌ర్స్ ని కూడా ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా విఫ‌ల‌మైంది. కార‌ణం రొటిన్ క‌థ‌.

ఇక ఈ మూవీ త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీలో క్రేజీ స్టార్ గా స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకున్న విజ‌య్ 'బీస్ట్‌' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఓ హాలీవుడ్ ఫిల్మ్ ని ప‌క్కాగా కాపీ చేశారంటూ ట్రైల‌ర్ రిలీజ్ నుంచే ఈ సినిమాపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. థియేట‌ర్ల‌లోకి ఏప్రిల్ 13న భారీ స్థాయిలో విడుద‌లైన ఈ మూవీ రొటీన్ స్టోరీ కావ‌డంతో ప్రేక్ష‌కులు, విజ‌య్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తుండ‌ట‌మే కాకుండా అస‌హ‌నంతో థియేట‌ర్ల‌కు నిప్పు పెడుతుండ‌టం ప‌లువురిని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. స్టార్ కాదు ప్రేక్ష‌కుడికిప్ప‌డు కంటెంట్ మాత్ర‌మే ముఖ్యం.. అది వుంటే స్టార్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అవుతున్నాడు. ఇది గుర్తించి ఇక నుంచైనా త‌మిళ స్టార్ లు మూస క‌థ‌ల‌ని ప‌క్క‌న పెట్టి స‌రికొత్త క‌థ‌ల‌తో రావాల‌ని ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు కొరుకుంటున్నారు.
Tags:    

Similar News