కొరటాలను మరింత ఒత్తిడిలోకి నెట్టిన జక్కన్న..!

Update: 2022-03-31 16:30 GMT
'మిర్చి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రచయిత కొరటాల శివ.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా సెన్సిబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ సినిమాలను తెరకెక్కిస్తూ.. అపజయం ఎరుగని దర్శకుడిగా సాగుతున్నారు. అయితే ఇప్పుడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. కొరటాలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కొరటాల శివ ఖాతాలో 'మిర్చి' తో పాటుగా 'శ్రీమంతుడు' 'జనతా గ్యారేజ్' 'భరత్ అనే నేను' వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నుంచి గత నాలుగేళ్లుగా మరో సినిమా రాలేదు. దీనికి కారణం అప్పటి నుండి 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉండటమే. 'సైరా' లేట్ అవ్వడం.. మధ్యలో కరోనా పాండమిక్ రావడం వల్ల కొరటాల సినిమాలు ఆలస్యమవుతూ వచ్చాయి.

చిరంజీవి - రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన 'ఆచార్య' సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ తన తదుపరి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇప్పటికే సినిమాలు లేట్ అవుతున్నాయంటే.. ఇప్పుడు జక్కన్న తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విజయం కొరటాల శివ పై మరింత ఒత్తిడి పెంచుతోందని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళితో పనిచేసిన ఏ స్టార్ హీరో అయినా.. తన తదుపరి సినిమా విషయంలో అంచనాలను అందుకోవడం అంత ఈజీ పనికాదు. అందుకే జక్కన్న సినిమా తర్వాత ఆ హీరోలు హిట్లు అందుకోవడానికి చాలా టైం పడుతుంది.

RRR సినిమా సక్సెస్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లలో జోష్ నింపింది. కొమురం భీమ్ గా తారక్.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ అదరగొట్టారు. దీంతో ఈ ఇద్దరి నెక్స్ట్ సినిమాలు చేస్తున్న కొరటాల.. వారిని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

కాకపోతే 'ఆచార్య' సినిమా ఇప్పటికే పూర్తయ్యింది. ఏమి చేసినా పోస్ట్ ప్రొడక్షన్ లో చేయాల్సిందే. కానీ ఎన్టీఆర్ 30వ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. ఇందులో స్టార్ హీరోని కొరటాల ఎలా చూపించబోతున్నాడో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. జక్కన్న బ్యాడ్ సెంటిమెంటుకు ఎదురెళ్లి బ్లాక్ బస్టర్ కొడతారా అని ఆలోచిస్తున్నారు.

ఈసారి కొరటాల శివ తన మార్క్ సోషల్ మెసేజ్‌ ని వదిలేసి.. 'మిర్చి' తరహా హీరో క్యారెక్టరైజేషన్‌ తో ఎన్టీఆర్‌ కి ఒక యాక్షన్ & మాస్ మూవీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి రిక్వెస్ట్లు పెడుతున్నారు.
 
అయితే NTR30 ఒక రివేంజ్ డ్రామా అని ఎన్టీఆర్ ఇప్పటికే ధ్రువీకరించారు. ఈ సినిమా షూటింగ్ జూన్‌ లో ప్రారంభం కానుంది. సమాజం పేరుతో ఉపన్యాసాలు ఇచ్చేవాడిగా కాకుండా.. ఒక పవర్ ఫుల్ రోల్ లో తారక్ ని చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

అభిమానులకు ఎలాంటి సినిమా కావాలో కొరటాలకు తెలుసు. 'జనతా గ్యారేజ్' సినిమాలో ఎన్టీఆర్ ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో కూడా సరికొత్త పాత్రలో చూపిస్తారని ఆశించవచ్చు. తారక్ మెకోవర్ కోసమే షూటింగ్ ను మరో మూడు నెలలు వాయిదా వేసుకున్నారనే టాక్ ఉంది. కొరటాల అంచనాలను అందుకుని ఎన్టీఆర్‌ కి ఎలాంటి హిట్ ఇస్తాడనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.

కాగా, NTR30 చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ (ఎన్టీఆర్ ఆర్ట్స్) సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన అలియా భట్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తారక్ పుట్టిన రోజు నాటికి అన్ని విషయాలపై స్పష్టత రానుంది.
Tags:    

Similar News