'జెర్సీ' హిందీ రీమేక్ డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కానుందా..?

Update: 2021-05-11 09:44 GMT
తెలుగులో సక్సెస్ అయిన ''జెర్సీ'' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో నాని హీరోగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాని బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ తో రీమేక్ చేస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. గీతా ఆర్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేయేషన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ - దిల్‌ రాజు - సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ 'జెర్సీ' చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని బీ టౌన్ వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నేపథ్యంలో బాలీవుడ్ మార్కెట్ పూర్తిగా దెబ్బతినింది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి బయటపడి టాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేసినప్పుడు కూడా అక్కడ కొత్త చిత్రాలు రిలీజ్ చేయడానికి సంకోచించారు. ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్ ప్రభావం కాస్త తగ్గి థియేటర్స్ లో సినిమాలు విడుదల చేసినా అక్కడి జనాలు వస్తారనే గ్యారెంటీ అసలే లేదు.

వాస్తవనికి బాలీవుడ్ మార్కెట్ మేజర్ షేర్ మల్టీప్లెక్స్ ల నుంచి వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని గురించి ఇంకొన్నాళ్లు మర్చిపోవాల్సిందే. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని హిందీ 'జెర్సీ' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రైట్స్ ని దక్కించుకోడానికి జీ స్టూడియో వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, 'జెర్సీ' చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సాచెట్ పరంపర - తానిష్ బాగ్చి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. రితేష్ సోని ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News