కశ్మీర్ ఫైల్స్ సినిమా షూటింగ్ కు ముందు అంత జరిగిందట

Update: 2022-03-20 02:30 GMT
ఒక సినిమా యావత్ దేశాన్ని కదిలించటమే కాదు..పెద్దఎత్తున చర్చకు తెర తీసిన క్రెడిట్ 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీకే దక్కుతుందని చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ విడుదలైన రెండు రోజుల తర్వాత నుంచి సినిమా స్వరూపమే మారిపోయింది. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో చేరటమే కాదు.. మరికొద్ది రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరటం ఖాయమని చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్. అతడు అసలుసిసలు హైదరాబాదీ. తెలుగు కూడా మాట్లాడతారు. విభిన్నమైన సినిమాలు తీసే ఆయన.. కశ్మీర్ ఫైల్స్ మూవీని నిర్మించటం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పాల్సిందే.

ఈ సినిమా ఇంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు రాగా.. అసలీ సినిమాను నిర్మించిందెవరన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. దీంతో.. నిర్మాత అభిషేక్ అగర్వాల్ సీన్లోకి వచ్చేశారు.

తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణానికి ముందు తాను.. సినిమా దర్శకుడు వివేక్ కలిసి ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని కలిశామన్నారు. అప్పట్లో కశ్మీర్ వ్యాలీలో ఏం జరిగిందన్నది తెలుసుకోవటం కోసం యూఎస్.. కెనడా.. సౌతాఫ్రికాలో మూడు నెలలు ప్రయాణించామని.. ఆ జర్నీ అంత సులువైనది కాదన్నారు.

ఎందుకంటే.. తాము కలిసిన వ్యక్తులు అప్పటి సంఘటల్ని గుర్తు చేసుకొని ఏడ్చేసేవారన్నారు. ఇక.. ఈ మూవీలో కశ్మీర్ పండిట్ పాత్రలో నటించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ అయితే.. సెట్ లో ప్రతి రోజూ ఏడ్చేసేవారని.. ఈ సినిమా నిర్మాణం ఒక భావోద్వేగ ప్రయాణంగా ఆయన అభివర్ణించారు. నిజమే.. ఈ సినిమాను థియేటర్లో చూసి.. సినిమా పూర్తి అయ్యాక..

థియేటర్ మొత్తం ఒక గంభీరవాతావరణం చోటు చేసుకోవటంతోపాటు..ప్రేక్షకుల ముఖాల్లో రక్తం ఇంకిపోయినట్లుగా.. ఒకలాంటి షాక్ లోకి వెళుతున్న పరిస్థితి. సినిమా మీద వస్తున్న విమర్శలకు సమాధానంగా నిర్మాత చెబుతున్న మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News