ఫోన్ లోనే పనికానిచ్చేస్తున్న యంగ్ టైగర్...!

Update: 2020-04-28 07:10 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరెకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తి కాకముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. ఇప్పటికే దీనికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా వస్తున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌ పై రాధాక‌ష్ణ‌ (చినబాబు).. హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. తారక్ ఈ స్రిప్ట్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడట.

లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాసులు డైలీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ స్క్రిప్ట్ డెవలప్మెంట్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారట. 'అరవింద సమేత' సినిమా చేసినప్పుడు ఎన్టీఆర్ కూడా స్క్రిప్ట్ డిస్కషన్ లో కూర్చునేవాడు. ఈసారి లాక్ డౌన్ వల్ల ఎవరింటికి వాళ్లే పరిమితం అయ్యారు. అయినా కానీ ఎన్టీఆర్ స్క్రిప్ట్ గురించి ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ తో చర్చిస్తున్నాడు. త్రివిక్రమ్ రాసిన సన్నివేశాల గురించి వీడియో కాల్స్ ద్వారా ఇద్దరు గంటల తరబడి మాట్లాడుకుంటూ కావాల్సిన విధంగా మలచుకుంటున్నారట. ఇప్పటికే కథ చాలా వరకు రెడీ అయిందని.. మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని సమాచారం. స్క్రిప్ట్ లాక్ అయిపోతే త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ కి వెళ్తాడు. ఈలోపు ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్'లో తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేస్తాడు. కరోనా ఎఫెక్ట్ తగ్గి లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి హీరోయిన్ విషయంలో రోజుకొక రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే 'రామయ్యా వస్తావయ్యా' సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ జోడీ సిల్వర్ స్క్రీన్ పై కనువిందు చేసినట్లే. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మరో చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే మరోసారి టి.టి.టి కాంబో రిపీట్ అవుతుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News