ఆస్కార్ నామినేష‌న్ కి Jr.NTR.. `వెరైటీ` క‌థ‌నం!

Update: 2022-08-14 04:38 GMT
ఆస్కార్ 2022-23 బ‌రిలో నామినేష‌న్ కి అర్హ‌మైన సినిమాల గురించి ఉత్త‌మ ప్ర‌దర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న‌ న‌టీన‌టుల గురించి ఇత‌ర విభాగాల ప్ర‌తిభావంతుల గురించి ఇప్ప‌టికే చ‌ర్చ మొద‌లైంది. ఈసారి ఆస్కార్ నామినేష‌న్ బ‌రిలో నిలిచే సినిమాల జాబితా గురించి ఉత్కంఠ నెల‌కొంది.

ఎన్న‌డూ లేనిది ఇలాంటి ఒక అరుదైన‌ సంద‌ర్భంలో ఒక తెలుగు సినిమా గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగుతోంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కి నామినేట్ అవుతుందా? అంటూ సినీ స‌ర్కిల్స్ స‌హా సామాన్య జ‌నంలోనూ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీనికి మీడియాల్లో క‌థ‌నాలు ఇతోధికంగా బూస్ట్ ఇస్తున్నాయి. ఇంత‌లోనే పాపుల‌ర్ సాటర్న్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఈ సినిమా మూడు విభాగాల్లో నామినేట్ అయిందన్న క‌బురు అందింది. పాపుల‌ర్ హాలీవుడ్ సినిమాల‌తో పోటీప‌డుతూ ఆర్.ఆర్.ఆర్ నామినేష‌న్ల బ‌రిలో ఉంద‌న్న క‌థ‌నాలు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. క‌నీసం ఈ మాత్రం చ‌ర్చ సాగినా అది తెలుగు సినిమాకు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్నారు. ఇప్పుడు తారక్ అభిమానులు సంబరాలు చేసుకునేందుకు ఓ భారీ వార్త వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో గోండు వీరుడు కొమురం భీమ్ గా న‌టించిన తార‌క్ ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్ కి ఆస్కార్ కి ఆస్కారం ఉందా? అంటూ ఆస‌క్తిక‌ర‌ గుస‌గుస‌లు ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నాయి.

పాపుల‌ర్ హాలీవుడ్ మ్యాగజైన్ `వెరైటీ` తాజాగా వెలువ‌రించిన ఓ క‌థ‌నంలో ఎన్టీఆర్ పేరును ప్ర‌స్థావించ‌డం సంచ‌ల‌నంగా మారింది. `ర్యాంక్ లేని` విభాగంలో ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డుకు అవకాశం ఉన్న పోటీదారులలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒకరిగా స‌ద‌రు వెరైటీ మ్యాగ‌జైన్ క‌థ‌నం పేర్కొంది. అలాగే రాజమౌళి .. RRR వరుసగా ఉత్తమ దర్శకుడు ఉత్తమ చలనచిత్ర అవార్డుల కోసం ఈ అన్ ర్యాంక్డ్ కేట‌గిరీలో పోటీదారుల జాబితాలో ఉన్నారు. నిజానికి ఈ మూవీకి ఆస్కార్ రావాల‌ని ఎవ‌రూ క‌ల‌గ‌న‌లేదు. ప్ర‌పంచ‌దేశాల్లో ప్ర‌జ‌లు త‌మ ప్ర‌శంస‌ల‌తో ఇప్ప‌టికే ఆస్కార్ ని మించి ఇచ్చారు. స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ త‌ర‌హాలో ఆర్.ఆర్.ఆర్ ఏదైనా సంచ‌ల‌నం సాధిస్తే అది భార‌త‌దేశానికి ఎంతో గౌర‌వం. ఇలాంటి సంద‌ర్భంలో ఈ చిత్రం అకాడమీ అవార్డ్స్ కు ఒక్క నామినేషన్ ను పొందగలిగినా అది తెలుగు సినిమాకు సాధించిన అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

రామ్ చ‌ర‌ణ్ - రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ క‌మ‌ర్షియ‌ల్ గా పాన్ ఇండియా కేట‌గిరీలో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 1000 కోట్లు వ‌సూలు చేసింది.
Tags:    

Similar News