కాంగ్రెస్ తో దోస్తీకి కేసీఆర్ రాయబారం.!

Update: 2019-05-10 01:44 GMT
ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ జంపింగ్ చేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు.. అవసరార్థం రాజకీయాలు చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. ఇప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కూడా ఆయన బీజేపీతో స్నేహంగా ఉంటూనే ప్రత్యామ్మాయాలు కూడా కేసీఆర్ సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొన్నటికి మొన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ తో కేసీఆర్ కలిసిరావాలని లేఖ రాశారు. ఆ దుమారం తగ్గకముందే ఇప్పుడు మరో సంచలన కథనాన్ని జాతీయ అగ్ర మీడియా ప్రచురించింది. కేసీఆర్ కాంగ్రెస్ తో దోస్తీకి ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది.

టీఆర్ ఎస్ ముఖ్య నేత ఒకరు ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యనేతతో రహస్య చర్చలు సాగించారని జాతీయ అగ్ర మీడియా ఓ వార్త కథనాన్ని ప్రచురించింది. రెండు పార్టీలకు చెందిన నేతలూ ఈ భేటిని ధ్రువీకరించినట్టు జాతీయ అగ్ర మీడియా తన కథనంలో స్పష్టం చేసింది.

కేంద్రంలో ఈ సారి హంగ్ వచ్చే అవకాశాలు పుష్కలం అని అన్ని జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలో ఏర్పడే ఏ కూటమి అయినా ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే ఏర్పడనుందన్న అంచనాలున్నాయి. నరేంద్రమోడీకి 180కు మించి సీట్లు రావని భావిస్తున్న కేసీఆర్ ఈ మేరకు దేశంలోని మిత్రపక్షాల మద్దతున్న కాంగ్రెస్ వైపే అడుగులు వేయబోతున్నారని సదురు పత్రిక కథనంలో పేర్కొంది. తాను ప్రధాని రేసులో లేనని చంద్రబాబు ప్రకటించడం.. మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కలిసివస్తే తన మద్దతు ఉంటుందని ప్రకటించడంతో కేసీఆర్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యలోనే టీఆర్ ఎస్ వైఖరి మారినట్టు అర్థమవుతోందని పత్రిక విశ్లేషించింది.
Tags:    

Similar News