మూవీ రివ్యూ : కొండపొలం

Update: 2021-10-08 12:45 GMT
చిత్రం :‘కొండపొలం’

నటీనటులు: వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్-కోట శ్రీనివాసరావు-నాజర్-సాయిచంద్-హేమ-మహేష్ విట్టా-రవిప్రకాష్-శ్యామల తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: రాజశేఖర్
కథ-మాటలు: సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి-సాయిబాబు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

ఓవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తో ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రం తీస్తూ.. మధ్యలో బ్రేక్ తీసుకుని పవన్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ‘కొండపొలం’ అనే చిన్న సినిమా తీశాడు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ప్రోమోల్లో ఒక కొత్త ప్రయత్నంలా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రవీంద్ర యాదవ్ (వైష్ణవ్ తేజ్) రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక మామూలు కుర్రాడు. డిగ్రీ పూర్తి చేసిన అతను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడుతుంటాడు. కానీ ప్రతిసారీ ఏదో అతడి ప్రయత్నం విఫలమవుతుంటుంది. చివరికి ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగానికి హాజరైన అతను ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాల నేర్చుకున్న పాఠాల గురించి అధికారులకు చెప్పడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో కరవు కాలంలో తన తండ్రితో కలిసి గొర్రెల మందకు మేత కోసం కొండపొలానికి వెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటాడు. మరి ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన అనుభవాలేంటి.. సమస్యలేంటి.. వాటిని అతనెలా అధిగమించాడు.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వీటిని అన్వయించుకుని ఎలా ముందడుగు వేశాడు.. చివరికి అతడి ఉద్యోగం సంగతి ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఒకప్పట్లా నవలలు.. ఇతర రచనల ఆధారంగా సినిమాలు తీసే దర్శకులు తెలుగులో అరుదైపోయారు. ఆ ట్రెండుకి ఎప్పుడో తెరపడిపోయింది. ఈ తరం దర్శకులెవరికీ అలాంటి  ఆలోచనే రావట్లేదు. ఐతే మంచి సాహిత్యాభిరుచి ఉన్న దర్శకుడు క్రిష్.. రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ అనే పుస్తకాన్ని ఉన్నదున్నట్లుగా తెరపైకి తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘కొండపొలం’ సినిమా. ఇంతకీ ఈ ‘కొండపొలం’ అంటే ఏంటి అంటే.. కరవు కాలంలో గొర్రెలకు మేత.. నీళ్లు దొరకడం కష్టమైపోయినప్పుడు ఊరి వాళ్లు తమ గొర్రెల మందల్ని తీసుకుని అడవికి వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి మళ్లీ పరిస్థితులు బాగుపడ్డాక తిరిగి వచ్చే ప్రక్రియ అన్నమాట. హీరో హీరోయిన్లను ఇలా గొర్రెలు మేపుకునేవాళ్లలా చూపించి.. ఈ కొండపొలం అనే కాన్సెప్ట్ మీద పూర్తిగా అడవి నేపథ్యంలో సినిమా తీయడం తెలుగులో పెద్ద సాహసమే. ఐతే కమర్షియల్ లెక్కలేసుకోకుండా మంచి కథల్ని చెప్పడానికే ప్రయత్నించే క్రిష్.. ధైర్యంగా ఈ సాహసం చేశాడు. కథలో ఉన్న బలానికి తోడు.. క్రిష్ కథన నైపుణ్యం కూడా తోడై.. ‘కొండపొలం’ ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ క్రిష్ తీసిన గమ్యం.. వేదం.. కంచె లాంటి చిత్రాల్లో మాదిరి ప్రేక్షకులను కదిలించే బలమైన ఎమోషన్ లేకపోవడం ‘కొండపొలం’కు మైనస్ అయింది. కొత్తగా అనిపించే కథాకథనాలు. రెండు గంటలకు పైగా నిడివిలో బోర్ కొట్టించకుండా సాగిపోయే సన్నివేశాలు.. కథనంలోని వేగం కాలక్షేపానికి ఢోకా లేకుండా చేస్తాయి కానీ.. ఎమోషనల్ గా వెయ్యాల్సినంత ఇంపాక్ట్ మాత్రం ‘కొండపొలం’ వేయదు.

పల్లెటూరిలో పెరిగి పెద్దవాడై కష్టపడి డిగ్రీ పూర్తి చేసినప్పటికీ..  ఇంగ్లిష్-కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు లేక ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడుతూ నాలుగేళ్ల పాటు ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్న ఓ కుర్రాడు.. తండ్రితో పాటు గొర్రెల మందను తీసుకుని కొండపొలానికి వెళ్లి అక్కడ ఎదురయ్యే సవాళ్లను ఛేదించే క్రమంలో జీవిత పాఠాలు నేర్చుకుని.. తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న నేపథ్యంలో ‘కొండపొలం’ కథ నడుస్తుంది. క్రిష్ ఎప్పుడూ మనిషి కథలను హృద్యంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో భావోద్వేగాలు పండించడంలో నేర్పు చూపిస్తుంటాడు. ‘కొండపొలం’లో కూడా మనుషులకు తోడు నోరు లేని జీవాలు.. ప్రకృతి కథను.. వెతల్ని తెరపైకి తీసుకొచ్చాడాయన. ‘కొండపొలం’ లాంటి కథను సినిమాగా తీయాలనుకోవడంలో ఆయన అభిరుచిని ప్రశంసించకుండా ఉండలేం. ఇలాంటి కథలు తెలుగు తెరపై చాలా చాలా అరుదు. రకుల్ ప్రీత్ లాంటి మోడర్న్ అమ్మాయిని గొర్రెల కాపరిగా చూపించి ఒప్పించి మెప్పించిన వైనం అభినందనీయం. హీరోను గొర్రెల కాపరిగా చూపించడమూ సాహసమే. అలాగని ఇందులో హీరో ఎలివేషన్లు.. కమర్షియల్ మెరుపులు లేకేమీ కాదు. గొర్రెల్ని పట్టుకుపోవాలని చూసే దొంగలు ఒక వైపు.. ఆకలి తీర్చుకోవడానికి చూసే పులి మరోవైపు..  హీరో-అతడి బృందం ఈ సవాళ్లను ఎదుర్కొనే.. పోరాడే సన్నివేశాలను ఉత్కంఠభరితంగానే తీర్చిదిద్దాడు క్రిష్. అలాగే ప్రకృతి పట్ల మనిషికి ఉండాల్సిన బాధ్యత గురించి ఆలోచన రేకెత్తించే సన్నివేశాలూ ఉన్నాయి. అన్నింటికీ మించి నోరు లేని జీవాల మీద ఆధారపడి బతికే మనుషుల్లో ఉండే స్వచ్ఛత.. అమాయకత్వం.. వాళ్ల బాధల్ని చాలా హృద్యంగా చూపించారిందులో. రవిప్రకాష్.. మహేష్ విట్టాల పాత్రలు.. వాటితో ముడిపడ్డ రెండు మూడు సన్నివేశాలు ప్రేక్షకులను కదిలిస్తాయి.

కొండపొలం గురించిన ఉపోద్ఘాతం.. అడవిలోకి హీరో బృందం ప్రయాణం..  అక్కడ దొంగలు.. పులితో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో ప్రథమార్ధంలో ‘కొండపొలం’ బాగానే ఎంగేజ్ చేస్తుంది. సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. ఇంటర్వెల్ ముంగిట దొంగలతో హీరో పోరాటం మాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తుంది. ఐతే ద్వితీయార్ధంలోకి వచ్చాక మాత్రం ‘కొండపొలం’ నెమ్మదిస్తుంది. హీరోకు కొత్త సవాళ్లు.. కొత్త సన్నివేశాలు లేకపోవడం అందుకు కారణం. పులి దాడికి ప్రయత్నించడం.. దాన్నుంచి తప్పించుకోవడం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు రిపిటీటివ్ గా అనిపిస్తాయి. నీటి కోసం తపన పడే ఒక్క సన్నివేశం మినహాయిస్తే ద్వితీయార్ధంలో కదిలించే సన్నివేశాలు పెద్దగా లేవు. భయం భయంగా అడవిలోకి అడుగు పెట్టి.. అక్కడ ఎదురయ్యే సవాళ్లను ఛేదించే క్రమంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకునే హీరో పరిణామ క్రమాన్ని ఒక దశ వరకు బాగానే చూపించినా.. ద్వితీయార్ధంలో అది కూడా దారి తప్పింది. పతాక సన్నివేశాల గురించి ఎంతో ఊహించుకుంటే చాలా సింపుల్ గా ముగించేయడం నిరాశ పరుస్తుంది. ఆ సన్నివేశం అంత సహజంగా కూడా లేదు. ఎర్రచందనం దొంగల సంగతి అలా మధ్యలో వదిలేయడం.. పులితో పోరాటాన్ని కూడా చప్పగా ముగించడంతో పతాక సన్నివేశాల్లో కలగాల్సిన ఉద్వేగం కలగదు. ప్రేమకథకు ఇచ్చిన రొటీన్ ట్విస్టు.. దాన్ని ముగించిన తీరు కూడా సాధారణంగా అనిపిస్తాయి. ఇంటర్వ్యూ సన్నివేశం కూడా హడావుడిగానే అనిపిస్తుంది. హీరోలో మార్పును ప్రతిబింబించేలా ఉద్వేగభరితంగా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దలేకపోయాడు క్రిష్. పతాక సన్నివేశాలను ప్రభావవంతంగా ఉండి ఉంటే ‘కొండపొలం’ మరో స్థాయిలో ఉండేది. అయినా సరే.. ఒక విభిన్నమైన సినిమా చూడాలని.. రాయలసీమ పల్లె జనాల గురించి.. వారి సంస్కృతి గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే ‘కొండపొలం’ మంచి ఛాయిసే.

నటీనటులు:

‘ఉప్పెన’లో కొంచెం భిన్నమైన.. సాహసోపేతమైన పాత్రతో అరంగేట్రంలోనే నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న వైష్ణవ్ తేజ్.. మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించాడు ‘కొండపొలం’లో. క్రిష్ లాంటి దర్శకుడు ఇలాంటి పాత్ర.. కథకు అతణ్ని సంప్రదించడం అంటే అతను ఏదో సాధించినట్లే. క్రిష్ అన్నట్లు ‘ఉప్పెన’ తర్వాత వైష్ణవ్ ఇంకో మెట్టు ఎక్కేశాడని చెప్పలేం కానీ.. రవీంద్ర యాదవ్ పాత్రకు మాత్రం న్యాయం చేశాడు. తొలి సినిమాతో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకపోవడం వల్ల రవీంద్ర పాత్రలో ఒదిగిపోవడానికి అతను పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో వైష్ణవ్ చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అతను మరీ బిగబట్టుకున్నట్లుగా కనిపించాడు. ఇక్కడ ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉండాల్సింది. మిగతా అంతా ఓకే. ఎక్కువగా మోడర్న్ అమ్మాయి పాత్రల్లో చూసిన రకుల్ ను.. గొర్రెలు మేపుకునే పల్లెటూరి అమ్మాయిగా చూసి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. తర్వాత అలవాటైపోతుంది. ఓబులమ్మ పాత్రకు న్యాయం చేయడానికి రకుల్ బాగానే కష్టపడింది. నటన పరంగా తనకు కెరీర్లో అత్యుత్తమ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఆర్టిస్టుల్లో అందరి కంటే ఎక్కువ ఆకట్టుకునేది సాయిచంద్. ఆయన నటనకు ఫిదా అయిపోతాం. ఓ నటుడు ఈ పాత్ర చేస్తున్నట్లు ఎక్కడా అనిపించదు. ఇంత సహజంగా ఇలాంటి పాత్రల్లో ఆయన ఒదిగిపోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. రవి ప్రకాష్ మంచి పాత్రతో, నటనతో ఆకట్టుకున్నాడు. కోట శ్రీనివాసరావు కనిపించిన కొన్ని సన్నివేశాల్లో తన అనుభవాన్ని చూపించాడు. గొర్రెల మందను నడిపించే బృందంలో ఉండే మిగతా నటీనటులందరూ చాలా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

ఎం.ఎం.కీరవాణి తన అభిరుచిని చాటిచెప్పే సంగీతం అందించాడు ‘కొండపొలం’ సినిమాకు. పాటలు మరీ శ్రావ్యంగా.. మళ్లీ మళ్లీ పాడుకునేలా లేవు కానీ.. సినిమా శైలికి సరిపోయేలా సాగాయి. అన్నింట్లోకి ‘శ్వాసలో’ పాట ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఓబులమ్మ పాట కూడా ఓకే. మిగతా పాటలన్నీ కథలో కలిసి నడిచిపోతాయి. రయ్ రయ్.. లాంటి థీమ్ మ్యూజిక్ బిట్స్ తో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. కథన శైలికి తగ్గట్లుగా ఛాయాగ్రహణం సాగింది. అడవి అందాల్ని చాలా బాగా చూపించారు. ఐతే ఒరిజినల్ కథలో ఉన్న రస్టిక్ ఫీల్ కొంచెం విజువల్ గా తగ్గిందనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త పడాల్సింది. రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి కథకుడిగానే కాక మాటల రచయితగానూ మెప్పించారు. సీమ యాస తెలిసిన వాళ్లకు ఆయన మాటల్లోని అందం అర్థమవుతుంది. అక్కడి పల్లెల్లోని వాడుక పదాల్ని చాలా బాగా పట్టుకున్నారాయన. ఇక దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇలాంటి కథను తెరమీదికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. ‘కొండపొలం’ నవలను వీలైనంత ఎగ్జైటింగ్ గానే తెరపై ప్రెజెంట్ చేశాడు క్రిష్. కాకపోతే కొత్తగా జోడించిన ప్రేమకథ రొటీన్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా చివర్లో ఈ కథను మలుపు తిప్పి.. ముగించిన తీరు చాలా సాధారణం. పతాక సన్నివేశాల విషయంలో క్రిష్ ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉండాల్సింది. ఓవరాల్ గా క్రిష్ దర్శకుడిగా ఓకే అనిపించాడు.

చివరగా: కొండపొలం.. అడవిలో జీవిత పాఠం

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News