'ఆచార్య' లో చిరు-చిరుత పాత్రల గురించి కొరటాల చెప్పిన విశేషాలు..!

Update: 2021-12-01 00:30 GMT
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ''ఆచార్య''. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు. ఇందులో ఆచార్యగా చిరు.. సిద్ధగా చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల 'సిద్దా సాగా' పేరుతో వచ్చిన చెర్రీ క్యారెక్టర్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.

ఇందులో కామ్రేడ్ సిద్దగా రామ్ చరణ్ ఒదిగిపోయిన విధానం.. గెటప్ - నటన అందరినీ ఆకట్టుకున్నాయి. 'ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది' అని చెర్రీ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ తో చప్పట్లు కొట్టిస్తోంది. ముఖ్యంగా ఈ టీజర్ లోని చివరి షాట్ మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పాలి. సెలయేరుకు ఒకవైపు చిరుత పిల్ల నీరు తాగుతుంటే.. దాని వెనుక తల్లి చిరుత కాపలా కాస్తూ చూస్తుంటుంది. మరోవైపు చిరు తనయుడు చరణ్ నీళ్లు తాగుతుండగా.. వెనుక చిరు కాపాలా కాసే షాట్ అదరగొట్టేసింది.

ప్రస్తుతం సిద్ధ టీజర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. చిరంజీవి - రామ్ చరణ్ లను ఒకే ఫ్రేమ్ లో చూసిన మెగా ఫ్యాన్స్.. దర్శకుడు కొరటాల శివ ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల మాట్లాడుతూ.. సిద్ధ టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ కు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ''ఆచార్య సినిమా ధర్మం గురించి చెబుతుంది.. ధర్మస్థలి చుట్టూ తిరిగే కథ ఇది. రామ్ చరణ్ పోసించిన సిద్ధ పాత్ర ధర్మానికి ప్రతిరూపం. సీన్స్ ఆర్గానిక్ గా రావడానికి టీమ్ మొత్తం చేసిన కృషే కారణం''  అని చెప్పారు.

సిద్ధ టీజర్ లో చివరి షాట్ గురించి మాట్లాడుతూ.. 'ఆచార్య' లో రామ్ చరణ్ కు సంబంధించి సన్నివేశాలు ఆర్గానిక్ గా ఉంటాయని.. అలాంటి సీన్స్ లో అదొకటని కొరటాల శివ తెలిపారు. ''సినిమాలో అది చాలా అందమైన షాట్. వాళ్ళిద్దరికే కరెక్ట్ గా సెట్ అవుతుంది. లక్కీగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఫేస్ ఉండటం.. ఆర్గానిక్ గా ఆ షాట్ ఉండటం కలిసొచ్చింది. ఫ్యాన్స్ అది చూసి ఎలా ఫీల్ అవుతున్నారో నేను ఊహించగలను. ఆ షాట్ తీసేటప్పుడు చాలా హై వచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాం. అయితే టీజర్ వచ్చాక అది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది'' అని కొరటాల అన్నారు.

తాను చెప్పాలనుకున్న ఐడియాతో పాటుగా.. మెగాస్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని.. ఫ్యాన్స్ ఏమి ఎక్సపెక్ట్ చేస్తారో అన్ని అంశాలు ఉండేలా 'ఆచార్య' కథ రాసానని కొరటాల తెలిపారు. దీనికి బోనస్ గా దొరికిన ప్రసాదం రామ్ చరణ్ అని.. చాలా పవర్ ఫుల్ గా ఆలోచనా శక్తి కలిగిన యువకుడిగా హానెస్ట్ సిద్ద కనిపిస్తాడని వెల్లడించారు. చిరంజీవి - రామ్ చరణ్ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా ఇదని.. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదని.. అందుకే కథ బాగా వచ్చినా వాళ్ళిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి కాస్త టెన్షన్ పడ్డానని కొరటాల తెలిపారు. రాబోయే రోజుల్లో రెండు పెద్ద విశేషాలు ఉంటాయని.. ఒకటి చిరంజీవి-చరణ్ కలిసి చేసిన పాట అయితే మరొకటి థియేట్రికల్ ట్రైలర్ అని చెప్పారు.

శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో చిరంజీవి-చరణ్ కలసి డ్యాన్స్ చేసిన పాట విజువల్ ట్రీట్ లా ఉంటుందని.. వారిద్దరూ చేస్తున్న ఫస్ట్ సాంగ్ కావడంతో షూటింగ్ జరిగిన వారం రోజులూ ఇండస్ట్రీ ప్రముఖులందరూ సెట్స్ కు వచ్చి చేసేవారని వెల్లడించారు. థియేట్రికల్ ట్రైలర్ లో ఇద్దరిని కలిపి చూపించబోతున్నానని.. రాబోయే రోజుల్లో చెప్పడానికి మరిన్ని విశేషాలు ఉన్నాయని కొరటాల శివ చెప్పుకొచ్చారు.

కాగా, దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంగా 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్.. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే సందడి చేయనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Full View
Tags:    

Similar News