ఇన్‌ సైట్‌: 'శ్రీమంతుడు' కొరటాల శివ

Update: 2015-08-17 09:42 GMT
శ్రీమంతుడు చిత్రంతో కొరటాల రెండో విజయం అందుకున్నాడు. ఈ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటూ బోలెడన్ని సంగతులు చెప్పాడు కొరటాల. వ్యక్తిగతం, వృత్తిగతం రెండిటిపైనా మాట్లాడాడు.. ఆ సంగతులివి....

కుటుంబ నేపథ్యం?

గుంటూరు దగ్గర్లోని పెద కాకాని మా సొంతూరు. ఇంటర్‌ వరకూ గుంటూరులో చదివాను. చిన్నప్పట్నుంచి క్లాసు పుస్తకాలు సహా సాహిత్యం చదవడం అలవాటు. అమ్మా నాన్నలది కమ్యూనిస్టు నేపథ్యం. దాంతో రకరకాల విషయాలపై ఇంట్లో చర్చ సాగేది. ఈ చర్చల్లో నేను మొదటి శ్రోత. తర్వాత వక్కతగా మారాను. నాన్న పంచాయితీరాజ్‌ శాఖలో ఉద్యోగి. నా పదేళ్ల వయసప్పుడే చనిపోయారు. పెళ్లి టైముకే అమ్మ పురపాలక శాఖలో ఉద్యోగిగా కొనసాగేది. నాన్న నుంచి దూరంగా ఉండలేక ఉద్యోగం వదులకుంది. అయితే నాన్న చనిపోయాక పురపాలక శాఖలో అమ్మకు ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత మమ్మల్ని చదివిస్తూ, తను కూడా చదువుకుంటూ పదోన్నతులు పొందేది. అన్నయ్య ప్రభుత్వోద్యోగిగా స్థిరపడ్డాడు. అమ్మ, నేను, అన్నయ్య.. మేం ముగ్గురమే.

స్కూలు, కాలేజీ రోజులు...

బళ్లారిలో బీటెక్‌ చదివా. స్కూలు రోజుల్నించి రాసే అలవాటుంది. కథలు, కవిత్వం రాసేవాడిని. బివిఎస్‌ రవి నాతో పాటు అదే కాలేజీలో చదివేవాడు. ఇద్దరం రచనల్లో ఒకరి పైత్యం ఒకరికి చూపించుకునేవాళ్లం. మొదటి నుంచీ స్నేహాలు ఎక్కువే. స్కూలు, కాలేజీ రోజుల్లోనూ ఎక్కువగా స్నేహితులు ఉండేవారు. అయితే బీటెక్‌ నాలుగేళ్లు రకరకాల కల్చర్స్‌ ఉన్న వాళ్లను కలిసే అవకాశం అదృష్టం కలిగింది. దాని వల్ల అందరినీ స్టడీ చేసే అవకాశం వచ్చింది. అలాగే అప్పట్లో నేను చేసిన తప్పులు ఇప్పుడు రచయితగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. స్కూలు, కాలేజీ జీవితాన్ని తప్పు దారి పట్టకపోతే అద్భుతాలు సాధించవచ్చు. ఆ నాలుగేళ్లు నా జీవితంలో కీలకం అయ్యాయి.

రచయిత కాకముందు...

కాలేజ్‌ అయిపోయాక బోలెడంత గందరగోళం. స్నేహితులు ఉద్యోగాలు, అమెరికా అంటూ వెళ్లిపోయారు. నేనేమో సినిమా రచయిత అవ్వాలని హైదరాబాద్‌ వచ్చా. ఇక్కడ ఓ సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. అయితే రచయిత అవ్వడం నా లక్ష్యం కాబట్టి సినిమాల్లో ప్రయత్నించాను.

సినీ ఎంట్రీ ఎలా?

పోసాని కృష్ణమురళి నాకు బంధువు. ఆయన వద్ద అసిస్టెంట్‌ రచయితగా చేరాను. బాగా చదువుకున్నావు.. సినిమాలెందుకు ? అన్న ఆయనే నా పట్టుదల చూసి ప్రోత్సహించారు. 1998 నుంచి ఆయన వద్దనే ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌ రచయితగా పనిచేశా. కథా చర్చల్లో పాల్గొనేవాడిని. అలా రచయితగా బోలెడంత అనుభవం ఘడించాను.

కెరీర్‌ ఆరంభం గురించి...

నేను పోసాని వద్ద పనిచేసేప్పుడే ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర బోయపాటి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా చేరాడు. పోసాని గారే అక్కడ పెట్టించింది. ఓసారి బోయపాటి నన్ను కథ ఉందా? అని అడిగాడు.. అప్పుడు ఇచ్చిందే భద్ర కథ. తొలి సినిమా హిట్టయ్యింది. బోయపాటి దర్శకుడిగా, నేను రచయితగా సక్సెస్‌. ఆ తర్వాత వరసగా బోలెడన్ని సినిమాలకు పనిచేశాను. మున్నా, బృందావనం, ఒక్కడున్నాడు, ఊసరవెల్లి సినిమాలకు మాటలు రాశాను. సింహా స్క్రిప్టు కోసం పనిచేశా. బోలెడన్ని వాటికి పేరే లేకుండా పనిచేశా.

మిర్చి ఎలా దక్కింది?

నేను రచయితగా ఉన్నప్పుడే దర్శకుడవ్వాలని మిర్చి కథ రాసుకున్నా. అప్పటికే నా స్నేహితుడు ప్రమోద్‌ సినిమా తీయాలనుకున్నాడు. మరో స్నేహితుడు వంశీ కూడా వచ్చి చేరాడు. ఈ ఇద్దరికీ ప్రభాస్‌ స్నేహితుడు. కథ చెప్పడానికి వెళ్లి ఒప్పించాం. అయితే అప్పటికే బాహుబలి లైన్‌ లో ఉంది. రాజమౌళి కాస్త ఆలస్యమవుతుంది అని చెప్పడంతో మాకు లైన్‌ క్లియరైంది. ఆ తర్వాత మహేష్‌ తో శ్రీమంతుడు తెలిసిందే.
Tags:    

Similar News