కన్నీరు పెట్టుకున్న నటి.. ఆ తప్పునకు రూ.5 లక్షలు పోగొట్టుకుందట

Update: 2022-09-28 04:41 GMT
సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పెట్టి ఎమోషనల్ అయ్యింది బుల్లితెర నటి లక్ష్మీ వాసుదేవన్. తాజాగా ఇన్ స్టాలో ఆమె పెట్టిన వీడియోపోస్టు వైరల్ గా మారటమే కాదు.. చర్చకు తెర తీసింది. అందులో ఆమె కన్నీటిపర్యంతమవుతూ.. తాను చేసిన తప్పును ఇంకెవరూ చేయొద్దంటూ వేడుకొంటోంది. తాను చేసిన తప్పునకు రూ.5లక్షల భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని.. అలాంటిదేదీ ఎవరూ చేయొద్దని పేర్కొంది.

తెలియక తాను చేసిన తప్పుతో ఇబ్బంది పడినట్లు చెప్పుకున్నారు. ఇంతకీ ఆమె పోస్టు చేసిన సెల్ఫీ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.. 'నేనీ విషయాన్ని వాట్సాప్ లో నా స్నేహితులందరికి షేర్ చేయాలనుకుంటున్నాను. నా ఫోటోను ఎవరో మార్ఫింగ్ చేసి.. కొత్త నంబరు నుంచి నాకు తెలిసిన వారందరికి పంపారు.

సెప్టెంబరు 11న రూ.5లక్షలు గెలుచుకున్నట్లుగా మా అమ్మకు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ తో పాటు ఒక లింకు కూడా వచ్చింది. నేను ఆ లింకుపై క్లిక్ చేశా. అప్పుడు ఫోన్లో ఒక యాప్ ఇన్ స్టాల్ అయ్యింది. అప్పటికప్పుడు నా ఫోన్ హ్యాక్ అయ్యింది.ఆ విషయం అప్పుడు నాకు తెలీదు" అని చెప్పారు.

అప్పటి నుంచి ఆమెకు కొత్త సమస్య మొదలైంది. ''మూడు రోజుల తర్వాత నుంచి నాకు మెసేజ్ లు రావటం మొదలయ్యాయి. మీరు లోన్ తీసుకున్నారని.. వెంటనే డబ్బులు చెల్లించాలని మెసేజ్ లు.. ఫోన్ కాల్స్ రావటం షురూ అయ్యాయి. చాలా దారుణంగా మాట్లాడి నాకు వాయిస్ నోట్ పంపారు. రూ.5వేల అప్పు కట్టకపోతే.. మీ ఫోటో అందరికీ పంపుతామని బెదిరింపులు వచ్చాయి. ఆ వెంటనే హైదరాబాద్ లోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశా. ప్రస్తుతం ఈ ఉదంతంపై విచారణ సాగుతోంది. కానీ.. ఇప్పటికి రూ.5లక్షలు చెల్లించినా ఆ నరకం నుంచి మాత్రం బయటపడలేదు" అని వెల్లడించారు.

కానీ.. అప్పటికే ఆమె ఫోటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి.. ఆమె వాట్సాప్ లోని కొన్ని కాంటాక్టులకు పంపారు. దీంతో.. పలువురు ఫోన్ చేసి.. ఏం జరిగిందంటూ పరామర్శలు మొదలు పెట్టేసరికి.. తనకేం చెప్పాలో అర్థం కాలేదని వాపోయింది. తన స్నేహితులకు తన గురించి తెలిసినప్పటికీ.. తాను ఏమిటన్నది తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని భోరుమంది. "తప్పుడు యాప్ లు డౌన్ లోడ్ అయి తెగ ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

మీరు డబ్బు గెలుచుకున్నారని.. తెలియని నంబరు నుంచి మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దు. తెలీకుండా ఏ యాప్ కూడా డౌన్ లోడ్ చేసుకోవద్దు. లక్కీ  డ్రా సందేశాల్ని నమ్మి మోసపోవద్దు. సైబర్ పోలీసులు నన్ను వీడియో మెసేజ్ కానీ.. వాట్సాప్ స్టేటస్ కానీ పోస్టు చేయమని.. అప్పుడు అందరికి అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ లోన్ యాప్స్ కారణంగా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటివి మహిళలు ఎదుర్కోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఒక్కో నంబరు నుంచి మెసేజ్ లు వస్తున్నాయి. సైబర్ పోలీసులు ఈ అంశంపై విచారణ చేస్తున్నారు" అని తన విషాద ఉదంతాన్ని చెప్పుకొచ్చారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Tags:    

Similar News