ఆమె విషయంలో భయమేసి అప్పట్లోనే పబ్లిక్ నోటీస్ ఇచ్చా: నరేష్

Update: 2022-02-23 08:32 GMT
సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు చేయబడింది. రంభ ఉన్నతి అరోమా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు రమ్య తమ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందని.. కానీ వాటిని తిరిగి చెల్లించడం లేదంటూ పలువురు బాధితులు మంగళవారం పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే ర‌మ్య అనే మ‌హిళ చేస్తున్న డ‌బ్బు వ‌సూళ్ల‌తో తనకు ఎలాంటి సంబంధం లేద‌ని నరేశ్ నిన్న ఉదయమే స్పష్టం చేశారు.

రమ్య రఘుపతికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నరేశ్ కు సైతం బాధితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తోన్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోని విడుదల చేశారు. డబ్బు వసూళ్ల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేసారు. ఏడేళ్ల నుంచే తానూ, రమ్య దూరంగా ఉంటున్నామని తెలిపారు. ఆర్థికపరమైన ఏ ఇతర అంశాల్లోనూ రమ్యతో తనకు కానీ,.. తన బంధువులకు కానీ ఎలాంటి సంబంధం లేదని మూడు నెలల క్రితమే పత్రికల్లో ఓ పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చానని నరేష్ పేర్కొన్నారు.

నరేష్ మాట్లాడుతూ.. "రమ్య రఘుపతి ఆర్థిక లావాదేవీల వ్యవహారం గురించి మీడియాలో వార్తలు రావడంతో ఉదయం నుంచి బంధుమిత్రులు, మీడియా మిత్రుల నుంచి నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. ఈ విషయంపై అందరికీ ఒకటే చెప్తున్నా.. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా జరిగిందని కూడా మొన్నటి దాకా నాకు తెలియదు. మాకు పెళ్ళై దాదాపు తొమ్మిదేళ్లయ్యింది. రెండు మూడేళ్లకే మేం విడిపోయాం''

''ఇటువంటి సమస్యలున్నాయి.. ఇంకా పెరుగుతుందని విడిపోయాం. అప్పటి నుంచి ఎవరికి వాళ్ళం విడివిడిగా మా జీవితాలు మేము జీవిస్తున్నాం. ఇప్పుడు మా ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. గతంలో హిందూపూర్ ఇష్యూ గురించి కొన్ని వార్తలు రావడంతో నాకు భయమేసి.. ప్రజలకు తెలియాలని మూడు నెలల క్రితమే పత్రికల్లో నేను ఓ పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది''

''ఆమెకు నాతో కానీ నా బంధువులకు కానీ ఆర్థికపరమైన ఏ ఇతర అంశాల్లోనూ ఎలాంటి సంబంధం లేదని ఆ నోటీస్ లో పేర్కొన్నాను. ఇలాంటి వాటి గురించి ఆమెను గతంలో హెచ్చరించాను కూడా. గత రెండు మూడు రోజులుగా బాధితులు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. దాంతో పోలీసుల నుంచి నాకు ఫోన్స్ వచ్చాయి. దీని గురించి నాకు తెలియదని.. అయినప్పటికీ ఈ విషయంలో నా సపోర్ట్ ఉంటుందని పోలీసులకు చెప్పాను''

''కాబట్టి ఈ పరిస్థితుల్లో మరోసారి చెబుతున్నా.. మేము ఇద్దరం ప్రస్తుతం దూరందూరంగా ఉన్నాం. నాకూ, నా కుటుంబానికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదు. ఇటువంటి ఫైనాన్స్ విషయాల్లో మా కుటుంబం ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు. మా కుటుంబానికి ఇవ్వడం తప్ప.. తీసుకోవడం తెలీదు. ఎవర్నీ బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. ఇంతకంటే నేను మాట్లాడలేను'' అని నరేశ్ పేర్కొన్నారు.

కాగా, న‌రేష్‌ ఆస్తుల్లో త‌న‌కు భాగం వుందని రమ్య ర‌ఘుప‌తి ప‌లువురి నుంచి భారీ మొత్తంలో డ‌బ్బు వసూలు చేసినట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి. హైదరాబాద్ - అనంతపూర్ - హిందూపూర్‌ లలో పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రమ్య చేతిలో మోసపోయినట్లు ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు అంతా బయటకి వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ర‌మ్య ర‌ఘుప‌తి ఆర్థిక లావాదేవీల వ్యవహారంతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌ని న‌రేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే రమ్య అనంతపురం జిల్లా సీనియ‌ర్ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి సోదరుని కుమార్తె అని వార్తలు వస్తున్నాయి. రమ్య టాలీవుడ్ లో కొందరు ప్రముఖుల వద్ద అసిస్టెంట్‌ గా కో డైరెక్టర్‌ గా వర్క్ చేసారని.. ఈ క్రమంలో నరేష్‌ తో పరిచయం పెంచుకొని వివాహం చేసుకుందని చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News