RRR: ఊరించారు.. ఉసూరుమనిపించారు..!

Update: 2022-03-27 00:30 GMT
'బాహుబలి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఇప్పుడు తన రికార్డులు తనే బ్రేక్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్'' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే రూ. 223 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది.

ఇద్దరు మహా వీరుల పాత్రల ఆధారంగా యాక్షన్ అండ్ ఎమోషన్స్ కలయికలో పవర్ ప్యాకెడ్ ఫిక్షనల్ డ్రామాగా రూపొందిన RRR సినిమా.. తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. జక్కన్న టేకింగ్ తో పాటుగా అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ - శ్రియా శరణ్ వంటి పాపులర్ స్టార్స్ భాగమయ్యారు. RRR ట్రైలర్ - ప్రోమోలలో ఆలియా - శ్రియాలను చూసిన జనాలకు.. సినిమాలో వారి పాత్రలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి కలిగింది. కానీ తీరా సినిమా చూసిన తర్వాత వారి ఫ్యాన్స్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

అలియా భట్ కు 'ఆర్.ఆర్.ఆర్' తెలుగు డెబ్యూ మూవీ. మొదటి నుంచీ ఆమె పోషించిన సీత పాత్రపై మేకర్స్ అంచనాలు పెంచుతూ వచ్చారు. ఎన్టీఆర్ - చరణ్ ల మధ్య తను బిగ్ రిలీఫ్ అని.. సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అని చెబుతూ వచ్చారు. అయితే సినిమాలో ఆమె పాత్ర కథకు డ్రైవింగ్ పాయింట్‌ గా పనిచేస్తుందే తప్ప మరేమీ కాదని కామెంట్స్ వస్తున్నాయి.

చెర్రీ-అలియా జోడీ కంటే తారక్-ఒలివియా మోరిస్ జంటకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందని అంటున్నారు. ఆలియా భట్ ను కేవలం బాలీవుడ్ జనాలను ఆకర్షించడానికి తీసుకున్నారేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు అంత చిన్న పాత్రకు స్టార్ హీరోయిన్ అవసరమా అని పెదవి విరిచిన వాళ్ళు కూడా ఉన్నారు.

మరోవైపు శ్రియకు కూడా చాలా తక్కువ సమయమే స్క్రీన్ మీద కనిపించింది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చూసిన తర్వాత.. ఈ పాత్రను ఎవరు చేసినా సరిపోతుంది.. శ్రీయా వంటి సీనియర్ హీరోయిన్ అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలియా లేదా శ్రియ వంటి ఇద్దరు స్టార్స్ తమ పాత్రల గురించి ఏమి విని సైన్ చేసారని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి అలియా - శ్రీయా వంటి ఇద్దరు పాపులర్ స్టార్స్ ని సినిమాలో చేర్చుకోవడం అదనపు హైప్‌ ని తీసుకొచ్చింది. కాకపోతే సినిమాలో వారి పాత్రలను చూసి చాలా మంది ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రల మీద ఫోకస్ పెట్టిన రాజమౌళి.. హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని కామెంట్స్ వస్తున్నాయి.
Tags:    

Similar News