ట్రైలర్ టాక్: యాక్షన్‌ సన్నివేశాలతో ఆసక్తి రేపుతున్న 'మాలిక్'

Update: 2021-07-06 13:30 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో థియేటర్లు మూతబడి ఉండటంతో సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. స్టార్ హీరోలందరూ తమ సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేయాలని కోరడంతో చాలామంది నిర్మాతలు సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ మాత్రం నిర్మాతలకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయంగా ఉన్న ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 'సి యూ సూన్' 'ఇరుల్' 'జోజి' వంటి చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేసిన 'పుష్ప' విలన్.. ఇప్పుడు తాను హీరోగా నటించిన ''మాలిక్'' అనే మరో చిత్రానికి డిజిటల్ రిలీజ్ కు రెడీ చేశారు.

''మాలిక్'' చిత్రాన్ని ముందుగా థియేటర్లోనే విడుదల చేయాలని భావించినా.. థియేటర్లు తెరుచుకోకపోవడంతో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నారు. జూలై 15న ఈ చిత్రాన్ని ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ''మాలిక్'' ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా 'ఇది రామదప్పల్లి వీధుల నుండి దాని సింహాసనం వరకు ప్రయాణం' అని అమెజాన్ ప్రైమ్ వీడియో ట్విట్టర్ హ్యాండిల్‌ లో పేర్కొన్నారు.

'మాలిక్' ట్రైలర్ చూస్తుంటే.. ఒక సామాజిక వర్గానికి లీడర్ గా ఎదిగిన సులేమాన్ అనే వ్యక్తి కథతో ఈ యాక్షన్ డ్రామా రూపొందిందని తెలుస్తోంది. సముద్ర తీరాన ఉన్న ఓ ప్రాంతంలో సమస్యలపై పోరాడే వ్యక్తిగా ఫహద్‌ కనిపిస్తున్నారు. కింది స్థాయి నుండి ధనవంతుడిగా ఎదిగే క్రమంలో అతన్ని ఎలాంటి అంశాలు ప్రభావితం చేసాయనే నేపథ్యంలో ఈ కథ సెట్ చేయబడింది. ఫహాద్ మరోసారి తనదైన శైలి నటనతో మెప్పించారు. యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

''మాలిక్'' చిత్రానికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించారు. ఇందులో నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. జోజు జార్జ్ - వినయ్ ఫోర్ట్ - జలజా - దిలీష్ పోథన్ - దినేష్ ప్రభాకరన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుశిన్‌ శ్యామ్‌సంగీతం సమకూర్చగా.. సను జాన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆంటో జోసెఫ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 15న అమెజాన్ లో స్ట్రీమింగ్ కానున్న 'మాలిక్' సినిమా ఎలాంటి ఆదరణ తెచ్చుకుంటుందో చూడాలి.


Full View
Tags:    

Similar News