మెగాస్టార్ వార్ ఎపిక్.. `సైరా`కు పోటీనా?

Update: 2019-06-08 08:16 GMT
బాహుబ‌లి సిరీస్ సెన్సేష‌న్స్ త‌ర్వాత భార‌తీయ సినిమా మేకింగ్ అమాంతం యూట‌ర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో వార్ ఎపిక్ డ్రామాల వెల్లువ మొద‌లైంది. చ‌రిత్ర‌ను త‌వ్వి తీసి క‌థ‌ల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అలా హిస్ట‌రీలో దాగి ఉన్న క‌థ‌లెన్నో పెద్ద తెర‌కు ఎక్కుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాల‌కు యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉండ‌డంతో ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తూ మార్కెట్ ని పెంచుకోవ‌డం కొత్త ప‌రిణామం.

ఆ కోవ‌లోనే తాజాగా మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్న‌ భారీ వారియ‌ర్ ఎపిక్ మూవీ వేడి పెంచుతోంది. `మామంగం` అనేది ఈ సినిమా టైటిల్. ఎం.ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్రాచీ తెహ్లాన్- ఉన్ని ముకుంద‌న్- ప్రాచీ దేశాయ్- మాళ‌విక మీన‌న్- మంద్ర‌క్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 17వ శ‌తాబ్ధానికి చెందిన వారియ‌ర్ ఎపిక్ చిత్ర‌మిది. `మామంగం` అనేది ఓ పండ‌గ పేరు. నాడు దుర్మార్గులైన‌ జ‌మోరిన్ పాల‌కుల‌ను ఎదురించే సూసైడ్ వారియ‌ర్స్ గా పేరు బ‌డ్డ ప‌లువురు యుద్ధ వీరులు మ‌మాంగం రోజు ఏం చేశార‌న్న‌దే సినిమా క‌థాంశం. ఇప్ప‌టికి 120 రోజుల షెడ్యూల్ లో 80 రోజుల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని తెలుస్తోంది.

తాజాగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజైంది. ఈ పోస్ట‌ర్ లో డాలు-క‌ర‌వాలం చేప‌ట్టి శ‌త్రువుపైకి లంఘిస్తున్న ఉగ్ర న‌ర‌సింహంలా క‌నిపిస్తున్నారు మ‌మ్ముట్టి అత‌డి సైన్యం. ఈ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వస్తోంది. త‌న కెరియ‌ర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన మ‌మ్ముట్టి తొలిసారి ఒక వారియ‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఆ క్ర‌మంలోనే అభిమానుల్లోనూ ఎంతో ఉత్కంఠ నెల‌కొంది. ఈ చిత్రాన్ని 2019 చివ‌రిలో తెలుగు-త‌మిళం-హిందీ-మ‌ల‌యాళంలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌మ్ముట్టి న‌టించిన ఓ సినిమా ఇంత భారీ కాన్వాసుతో రిలీజ‌వుతుండ‌డం ఇదే తొలిసారి. వాస్త‌వానికి ఈ సినిమా ఇంకాస్త వేగంగా పూర్త‌య్యి రిలీజ్ కావాల్సిన‌ది. అప్ప‌ట్లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య  గొడ‌వ‌ల వ‌ల్ల తొలుత ఎంపిక చేసుకున్న ద‌ర్శ‌కుడు సంజీవ్ పిళ్లై స్థానంలో ప‌ద్మ‌కుమార్ కి అవ‌కాశం ఇచ్చారు. ఈ చిత్రాన్ని వేణు కున్న‌పిళ్లై నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివ‌రిలో రిలీజ‌వుతున్న మ‌మ్ముట్టి వార్ ఎపిక్.. మ‌న మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న సైరాకి పోటీనా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. మెగాస్టార్ సైరా చిత్రాన్ని ద‌స‌రా బ‌రిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ ఉన్నా 2020 సంక్రాంతి వ‌ర‌కూ కుద‌ర‌క‌పోవ‌చ్చ‌న్న ఊహాగానాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

    

Tags:    

Similar News