నానిని చూసి తేలికే అనుకున్నారు కానీ..

Update: 2015-11-18 19:30 GMT
నాని స్టార్ ఏమీ కాదు. అయినా అతడి సినిమా ‘భలే భలే మగాడివోయ్’ యుఎస్ బాక్సాఫీస్ లో అలవోకగా మిలియన్ క్లబ్ ను అందుకుంది. ఏకంగా ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా కలెక్షన్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకుంది. ఇంతకుముందు ‘ఈగ’ సినిమాతోనూ నాని యుఎస్ మిలియన్ క్లబ్ ను టచ్ చేశాడు కానీ.. ఆ క్రెడిట్ అతడికి దక్కలేదు. రాజమౌళికే వెల్లిపోయింది. కానీ ‘భలే భలే మగాడివోయ్’ సక్సెస్ లో నాని క్రెడిట్ ఎక్కువే కాబట్టి మిలియన్ డాలర్స్ ఘనత అతడికే కట్టబెట్టొచ్చు.

స్టార్ ఇమేజ్ లేని నానినే సునాయాసంగా మిలియన్ క్లబ్బులోకి ఎంటరైపోయాడు కాబట్టి.. ఇక యుఎస్ తో ఓ మోస్తరు సినిమాలు కూడా ఈజీగా ఆ క్లబ్బులోకి అడుగు పెట్టేస్తాయనుకున్నారు టాలీవుడ్ ట్రేడ్ పండిట్స్. కానీ వాస్తవ పరిస్థితి అంత తేలిగ్గా ఏమీ లేదు. ‘భలే భలే మగాడివోయ్’ తర్వాత వచ్చిన సినిమాల పరిస్థితి యుఎస్‌ లో చాలా కష్టంగా ఉంది. భలే భలే తర్వాత మంచి క్రేజ్ తో విడుదలైన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అయినా సగం మిలియన్ డాలర్స్ కూడా వసూలు చేయలేదు. శివమ్ సంగతి చెప్పాల్సిన పని లేదు.

ఃఆశ్చర్యకరంగా రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’కి కూడా మిలియన్ క్లబ్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. శ్రీను వైట్ల, చిరంజీవి హ్యాండ్స్ పడ్డా చరణ్ కు యఎస్ లో ‘మిలియన్’ రుచి చూపించలేకపోయారు. ‘రుద్రమదేవి’ కష్టం మీద ఆ మార్కును అందుకున్నట్లుంది. ‘కంచె’ బాగానే పెర్ఫామ్ చేసింది కానీ.. ఆ క్లబ్బును అందుకునే పరిస్థితి లేదు. ‘అఖిల్’ అలవోకగా ఆ ఫీట్ సాధిస్తాడనుకున్నారు కానీ.. ఆ సినిమా దారుణంగా చతికిలపడింది. మొత్తానికి నానిని చూసి యుఎస్ మిలియన్ క్లబ్ చాలా తేలికనుకున్నారు కానీ.. అదంత ఈజీ ఏమీ కాదని తేలిపోయింది.
Tags:    

Similar News