MB యూనివ‌ర్శిటీ స‌రే.. MAA ఇండ‌స్ట్రీ బాగు ఎలా?

Update: 2022-01-13 06:08 GMT
టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం న‌టుడిగా నిర్మాత‌గా విశేష సేవ‌లందించారు డా.మంచు మోహ‌న్ బాబు. ఆయ‌న తిరుప‌తిలో శ్రీ‌విద్యానికేత‌న్ ని స్థాపించి అంచెలంచెలుగా విస్త‌రించారు. కుమారులు మంచు విష్ణు.. మంచు మ‌నోజ్ .. కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న అండ‌దండ‌ల‌తో మంచు మోహ‌న్ బాబు దిగ్విజ‌యంగా శ్రీ‌విద్యానికేత‌న్ స‌హా టెక్నో స్కూళ్ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

తాజాగా మంచు మోహ‌న్ బాబు నుంచి సంక్రాంతి స్పెష‌ల్ ప్ర‌క‌ట‌న ఉంటుందంటూ `మా` అధ్య‌క్షుడు మంచు విష్ణు ట్విట్ట‌ర్ లో హాట్ న్యూస్ స‌ర్క్యులేట్ అయ్యింది. ఇంత‌లోనే ఆయ‌న నుంచి ప్ర‌క‌ట‌న రానే వ‌చ్చింది. ఇక‌పై మంచు కుటుంబం MB యూనివ‌ర్శిటీని స్థాపించి విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తుంద‌నేది ఈ ప్ర‌క‌ట‌న సారాంశం. ఇది డీమ్డ్ యూనివ‌ర్శిటీ. దీని ఏర్పాటుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఎట్ట‌కేల‌కు వారి విద్యానికేత‌న్ సామ్రాజ్యంలో మ‌రో క‌లికితురాయి చేరింద‌ని ప్ర‌క‌టించారు. ఎంబీయు - మోహ‌న్ బాబు యూనివ‌ర్శిటీ పేరిట దీనిని ర‌న్ చేయ‌నున్నామ‌ని తెలిపారు.

ఒక డీమ్డ్ యూనివ‌ర్శిటీని స్థాపించ‌డం అంటే అది గొప్ప విష‌యం. అందులో ఎలాంటి సందేహం లేదు. విద్యారంగంపై మ‌క్కువ‌తో వారు చేస్తున్న ప్ర‌య‌త్నం అభినంద‌నీయం అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. అయితే అదే స‌మ‌యంలో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు మంచు వ‌ర్గాల నుంచి స‌మాధానాన్ని ఇండ‌స్ట్రీ ఆశిస్తోంది. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ ఎన్నో స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటోంది. అందులో `ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కు` అనే టాపిక్ బ‌ర్నింగ్ ఇష్యూగా మారింది. అస‌లే ప‌రిశ్ర‌మ క‌ష్టాల్లో ఉంది. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల్ని పెంచేందుకు స‌సేమిరా అంటుంటే ప‌రిశ్ర‌మ భేజారెత్తిపోతోంది. ఓవైపు వైర‌స్ వెంటాడుతుంటే మ‌రోవైపు ప్ర‌భుత్వాలు వేధిస్తున్నాయ‌న్న ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిని ప‌రిష్క‌రించే పెద్ద దిక్కు లేక‌పోవ‌డం బాధాక‌రం. అయితే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడు అయిన మంచు మోహ‌న్ బాబు ప‌రిస్థితిని చక్క‌దిద్దేందుకు ఎందుక‌ని ప్ర‌య‌త్నించ‌డం లేదు? అన్న ప్ర‌శ్న బ‌లంగా వినిపిస్తోంది. ఏదో ఒక లేఖాస్త్రం సంధిస్తే స‌రిపోతుందా? ప‌రిష్కారం కావాలి క‌దా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘానికి సొంత భ‌వంతి లేదు. మోహ‌న్ బాబు వార‌సుడు మంచు విష్ణు `మా` అధ్య‌క్షుడు అయిన త‌ర్వాత సొంత ఖ‌ర్చుల‌తో ఆర్టిస్టుల‌కు సొంత భ‌వంతిని నిర్మిస్తాన‌ని .. ఆర్టిస్టులెవ‌రూ పైసా పెట్టుబ‌డి కూడా పెట్టాల్సిన ప‌ని లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన అప్ డేట్ లేనే లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌నిలో ప‌నిగా ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కుగా తాను ఏం చేయ‌ద‌లిచార‌నేది మోహ‌న్ బాబు చెప్ప‌డం లేద‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. స‌మ‌స్య ఉన్న‌ప్పుడు సూటిగా స్పందించే విజ్ఞులైన మోహ‌న్ బాబు టాలీవుడ్ ఎంతో పెద్ద స‌మ‌స్య‌లో ఉన్న‌ప్పుడు చేసిందేమిటి? అన్న విమ‌ర్శ బ‌లంగా ఉంది. మ‌రి వీట‌న్నిటికీ మంచు కాంపౌండ్ నుంచి స‌మాధానాలు వ‌స్తాయ‌నే అంతా ఆశిస్తున్నారు.
Tags:    

Similar News