NC22 ప్రీ లుక్: చైతూ ఆవేశాన్ని ఏ శక్తీ అదుపు చేయలేదు..!

Update: 2022-11-22 06:39 GMT
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా NC22 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ బైలింగ్విల్ ప్రాజెక్ట్ లో స్టార్ క్యాస్టింగ్ మరియు టాప్ టెక్నిషియన్స్ భాగం అవుతున్నారు.

అయితే ఇప్పుడు NC22 నుంచి ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. నాగచైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రేపు బుధవారం అక్టోబర్ 23న ఉదయం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈరోజు ఉదయం ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు.

'అతని ఆవేశాన్ని ఏ శక్తీ అదుపు చేయదు' అంటూ రిలీజ్ చేసిన #NC22 భీకరమైన ప్రీ లుక్ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పోలీస్ గెటప్ లో ఉన్న నాగచైతన్య ను కొందరు పోలీసులు గన్నులు గురి పెట్టి అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. చైతూ పేస్ ని రివీల్ చేయకుండా.. కేవలం అతని కళ్ళు మాత్రమే కనిపించేలా ఈ పోస్టర్ ని డిజైన్ చేసారు. ఇంటెన్స్ గా ఉన్న చై కళ్ళు చూస్తుంటే.. అతను ఆవేశంతో రగిలిపోతున్నట్లు కనిపిస్తోంది.

NC22 సినిమాలో చైతన్య ఒక పోలీస్ గా కనిపించనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. లేటెస్టుగా వచ్చిన ప్రీ లుక్ పోస్టర్ ఫస్ట్ లుక్ పై ఉత్సుకతను పెంచేసింది. అక్కినేని వారసుడు తన కెరీర్ లోనే తొలిసారిగా ఇలాంటి వైవిధ్యమైన సినిమాలో నటిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. మరి నాగచైతన్య పుట్టినరోజు కానుకగా రేపు ఉదయం 10.18 గంటలకు రాబోతున్న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలాంటి స్పందన తెచ్చుకుంటాయో చూడాలి.

ఇందులో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సుప్రీమ్ టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి - తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ మరియు జాతీయ అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమ్‌ జీ అమరన్ - వెన్నెల కిషోర్ - సంపత్ రాజ్ - 'కార్తీక దీపం' వంటలక్క ప్రేమి విశ్వనాథ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ హీరో జీవా అతిథి పాత్ర చేస్తున్నట్లు సమాచారం.

మాస్ అండ్ యాక్షన్ అంశాలతో కూడిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో ఓ హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసారు. ఇది నాగ చైతన్య కెరీర్‌ లోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ని నిర్మిస్తున్నారు.

లెజెండరీ తండ్రీ కొడుకులు మాస్ట్రో, ఇసైజ్ఞాని ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తున్నారు. ఎస్‌ఆర్‌ కతిర్‌ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. యాన్నిక్ బెన్ - మహేష్ మాథ్యూ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. వెంకట్ రాజన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

NC22 అనేది నాగ చైతన్య కు డెబ్యూ తమిళ్ మూవీ. అలానే విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభుకు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. మరి వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం దర్శక హీరోలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News