జక్కన్న కు నీల్ పోటీదారుగా మారాడా..??

Update: 2022-04-17 07:30 GMT
కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన 'కేజీఎఫ్' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. దీంతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు నీల్. పదుల సంఖ్యలో సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా.. మాస్ ఆడియన్స్ పల్స్ పట్టగాలిగాడు.

మదర్ సెంటిమెంట్ తో పాటుగా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మరియు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు తీయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్నారు ప్రశాంత్. పార్ట్-1 తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు.. ఇప్పుడు రెండో భాగం 'కేజీయఫ్: చాప్టర్ 2' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన 'కేజీఎఫ్ 2'.. దీనికి తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగింది. మేకర్స్ ప్రకటించిన లెక్కల ప్రకారం రెండు రోజుల్లోనే 240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క హిందీ బెల్ట్ లోనే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కి ప్రశాంత్ నీల్ పోటీదారుగా మారాడనే చర్చ మొదలైంది. చాలామంది ఈ స్టేట్మెంట్ తో ఏకీభవించకపోవచ్చు కానీ.. ఇప్పుడు టాలీవుడ్ - ఫిల్మ్ నగర్ లలో దీనిపైనే డిస్కషన్ జరుగుతోంది.

'బాహుబలి' చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా స్టామినా ఏంటో చాటిచెప్పిన జక్కన్న.. అపజయం ఎరుగని దర్శకధీరుడుగా కొనసాగుతున్నారు. లేటెస్టుగా RRR సినిమాతో మరోసారి వరల్డ్ వైడ్ గా సత్తా చాటారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు మాత్రమే రూపొందించి ప్రతిభావంతుడని అనిపించుకున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ లోకల్ టెక్నీషియన్స్ తోనే బాక్సాఫీస్ బరిలో భారీ సినిమాలను నిలుపుతున్నారు.'ఉగ్రమ్' 'కేజీఎఫ్' 1&2 చిత్రాలకు ప్రధాన సిబ్బంది అంతా కర్ణాటకకు చెందినవారే. మరోవైపు లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని తెరకెక్కించే రాజమౌళి.. వివిధ భాషలకు చెందిన విభిన్న వ్యక్తులను ఇన్వాల్వ్ చేసుకుంటారు.

అంతేకాదు ఉత్తరాది మరియు దక్షిణాది మధ్య సరిహద్దులను బద్దలు కొట్టడానికి రాజమౌళి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ కేవలం మూడు సినిమాల అనుభవంతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించారు. ఇక హిందీ మార్కెట్ లో ఓపెనింగ్ డే 'కేజీయఫ్ 2' వసూళ్ళు 'బాహుబలి 2' మరియు RRR కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఇలా పలు విషయాలలో ఓ వర్గం ఆడియన్స్ రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను పోల్చుతున్నారు. మరో వర్గం మాత్రం నీల్ పనితనాన్ని ప్రశంసిస్తూనే వీరిద్దరి మధ్య పోలిక సరికాదని అంటున్నారు. 'బాహుబలి' సినిమాతో భాష - ప్రాంతీయత సరిహద్దులు చేరిపేసి పాన్ ఇండియాకు బాటలు వేసింది జక్కన్న అని.. ఇప్పుడు నీల్ అయినా మరో దర్శకుడైనా ఆ మార్గంలోనే నడుస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
Tags:    

Similar News