`స్క్విడ్ గేమ్` ఫ్యాన్స్ కి నెట్ ప్లిక్స్ గుడ్ న్యూస్

Update: 2021-11-10 08:46 GMT
కొరియ‌న్ యాక్ష‌న్ సిరీస్ `స్క్విడ్ గేమ్` సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నెట్ ప్లిక్స్ లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ సిరీస్ నెట్ ప్లిక్స్ రేంజ్ నే మార్చేసింది. ఈ సిరీస్ కి ప్ర‌త్యేక‌మైన‌ అభిమానులు ఏర్ప‌డ‌టం.. ఫాలోయింగ్ పెర‌గ‌డంతో నెట్ ఫ్లిక్స్ స‌బ్ స్క్రైబ‌ర్లు ఒక్క‌సారిగా పెరిగారు. రెండు బిలియ‌న్ల (200కోట్లు) మంది ఫాలోవ‌ర్స్ ఈ సిరీస్ ని వీక్షిస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. ఆ ర‌కంగా వాణిజ్య ప‌రంగా నెట్ ప్లిక్స్ కి ఈ సిరీస్ భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. తాజాగా `స్క్విడ్ గేమ్` సృష్టిక‌ర్త హ్యాంగ్ డాంగ్ హ్యూక్ ఓ శుభ‌వార‌త్తో ముందుకొచ్చారు.

ఈ సిరీస్ కి రెండ‌వ సీజ‌న్ ని సిద్ధం చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు హ్యాంగ్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఇది త‌న ఆలోచ‌న ప‌రిధిలో ఉంద‌ని.. ప్లానింగ్ జ‌రుగుతుంద‌న్నారు. కానీ దానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు మాత్రం ఇప్పుడే చెప్ప‌లేన‌న్నారు. స్క్విడ్ గేమ్ సిరీస్ ఎప్పుడు ఎలా మొద‌ల‌వుతుందా అని తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు. సీజ‌న్ -1 పెద్ద స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో సీజ‌న్-2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఈ సిరీస్ పై పెట్టుబ‌డులు పెట్ట‌డానికి బ‌డా క‌ర్పోరేట్ సంస్థ‌లు పోటీగా ముందుకొస్తున్నాయి. ఈ సిరీస్ ని చేజిక్కించుకోవాల‌ని మిగ‌తా ఓటీటీ సంస్థ‌లు కూడా గ‌ట్టిగానే పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

`స్క్విడ్ గేమ్` అనేది ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. దీనిలో పాత్ర‌ల‌న్నీ జీవితాంతం గేమింగ్ చుట్టూనే తిరిగేలా సృష్టించ‌బ‌డ్డాయి. మ‌రి సీజ‌న్ -2ని ఎలా డిజైన్ చేస్తారు? అన్న‌ది చూడాలి. పెరుగుతోన్న టెక్నాల‌జీలో ఇలాంటి గేమింగ్ షోల‌కు ప్రేక్ష‌కుల నుంచి విశేష ఆధ‌ర‌ణ ల‌భిస్తోంది. టెక్నాల‌జీని ఇష్ట‌ప‌డే ప్రియులంతా వీటిపైనే ఎక్కువ‌గా ఆసక్తి చూపిస్తున్నారు. మిగ‌తా ఓటీటీలు కూడా ఆ దిశ‌గా ముందుకు క‌దులుతున్నాయి. వీడియో గేమ్స్ స్ఫూర్తితో కొన్ని సీన్ల‌ను లేదా యాక్ష‌న్ సీన్ల‌ను తీస్తున్న మ‌న క్రియేటివ్ డైరెక్ట‌ర్లు స్క్విడ్ గేమ్ స్ఫూర్తితో ఏదైనా సినిమాని తీసినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఆన్ లైన్ గేమ్స్ చాలా క‌థ‌ల‌కు స్ఫూర్తినిస్తుండ‌డం ఇప్పుడు ట్రెండ్.
Tags:    

Similar News