RRR: ఇండియాలో ఫస్ట్ ప్రీమియర్ షో పడేది అక్కడేనా..?

Update: 2022-03-23 13:39 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్'' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూఎస్ఏలో రేపు గురువారం ప్రీమియర్ షోలు పడననున్నాయి. ఇండియాలోనూ పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే RRR మొట్టమొదటి ప్రీమియర్ ను ముంబైలో వేస్తారని టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' ఫస్ట్ టాక్ ఏమిటో తెలుసుకోవడానికి, మొదట కరణ్ జోహార్‌ తో సహా కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో స్పెషల్ షో ప్రదర్శించారు. ఇప్పుడు కూడా, 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' ను మొదట ముంబైలోని కొంతమంది ప్రత్యేక సెలబ్రిటీల కోసం ప్రదర్శించబోతున్నారట. ఈ ప్రీమియర్ షో గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం ఉంటుందని అంటున్నారు.

అంటే RRR అద్భుతమైన సృష్టిని అందరి కంటే ముందు ముంబై ప్రజలు చూడబోతున్నారు. ఇదే జరిగితే బాలీవుడ్ జనాలు ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అటువంటి సెలబ్రిటీ ప్రీమియర్ ఏదీ వేయడం లేదు.

కాకపోతే పలు థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తుండగా.. రేపు అర్థ రాత్రి తర్వాత బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. ఇక యూఎస్ ప్రీమియర్ షోల ద్వారా అఫిషియల్ గా 'ఆర్.ఆర్.ఆర్' ఫస్ట్ టాక్ బయటకు రానుంది. దీని కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కాగా, 'ఆర్. ఆర్. ఆర్' చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్ - అజయ్ దేవగన్ - సముద్ర ఖని - రే స్టీవెన్సన్ - ఒలివియా మోరిస్ - అలిసన్ డూడీ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో RRR మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలో 'బాహుబలి' రికార్డులు బ్రేక్ అవుతాయా లేదా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News