మెగాస్టార్ ను ఛాన్స్ అడిగితే ఆయనన్నమాట అదే!

Update: 2022-04-11 07:45 GMT
మొదటి నుంచి కూడా తమిళ .. మలయాళ భాషలకి సంబంధించిన ఆర్టిస్టులే తెలుగు తెరపై కనిపించేవారు. కన్నడ నుంచి ను వచ్చిన వారు తక్కువమందే. అయితే చాలా కాలం క్రితం కన్నడ నుంచి తెలుగుకి వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోగా ఉపేంద్ర కనిపిస్తారు. నటుడిగా .. దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ఉంది. తెలుగులో 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర చేసిన 'ఉపేంద్ర' .. చాలా గ్యాప్ తరువాత  'గని' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.  

తాజా  ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "కన్నడలో ఒక వైపున సినిమాలు .. మరో వైపున రాజకీయాలు. అందువలన నేను తెలుగు సినిమాలు ఎక్కువగా చేయలేకపోతున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నాపై ఇప్పటికీ వారికి అభిమానం తగ్గలేదు.

అందువలన ఇకపై గ్యాప్ రాకుండా తెలుగులో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు నచ్చిన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. 'గని'లో పాత్ర నచ్చడం వల్లనే ఆ సినిమాను చేశాను.

తెలుగులో మెగా ఫ్యామిలీ నుంచి నాకు ఎంతో సపోర్ట్ లభిస్తోంది. నాగబాబుగారితో కలిసి 'ఒకే మాట' సినిమాలో నటించాను. బన్నీతో కలిసి 'సన్నాఫ్ సత్యమూర్తి' చేశాను. ఆ సినిమాలో పాత్రకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వరుణ్  తేజ్ కాంబినేషన్లో  చేసే ఛాన్స్ రావడం విశేషం. గతంలో చిరంజీవి సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి అశ్వనీదత్ నిర్మాత. కొన్ని కారణాల వలన ఆ సినిమాను చేయలేకపోయాను. అందుకు ఇప్పటికీ కూడా నేను బాధపడుతూనే ఉంటాను.

 ఒకసారి చిరంజీవిగారిని అనుకోకుండా ఫ్లైట్ లో కలుసుకున్నాను. 'సార్ .. డైరెక్టర్ గా మీతో ఒక సినిమా చేయాలనుంది' అని అడిగాను. 'ఉపేంద్రగారు .. ఈ మధ్య మీరు ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయ్యారు. హీరోగా అక్కడ చక్రం తిప్పేస్తున్నారు .. ఇప్పుడెక్కడ చేయడం కుదురుతుందిలే' అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

మంచి కథ దొరికితే .. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను. ప్రస్తుతం ఒక సినిమా కి డైరెక్షన్ చేయాలనే ఉద్దేశంతో, ఫామ్  హౌస్ లో కూర్చుని స్క్రిప్ట్ రాసుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News