అబద్ధాలు చెప్పడంలో ఆర్జీవినే స్ఫూర్తి: రాజమౌళి

Update: 2022-03-17 11:30 GMT
దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం చూసుకుంటే బుల్లితెర నుంచే ఆయన అడుగులు మొదలైన తీరు కనిపిస్తుంది. అప్పట్లో 'శాంతి నివాసం' అనే సీరియల్ కి ఆయనే దర్శకుడు. ఆ సీరియల్ కి దర్శకత్వ పర్యవేక్షణగా రాఘవేంద్రరావు పేరు పడేది. ఆ తరువాత రాజమౌళి సినిమాల వైపుకు రావడం, స్టూడెంట్ నెంబర్ 1' సినిమాతో వెండితెరపై తన పరుగును మొదలుపెట్టడం జరిగిపోయింది. అది మొదలు అప్పటి నుంచి ఆయన ఫ్లాప్ అనే మాట వినలేదు. హిట్ అనే మాటకు దూరంగా వెళ్లలేదు. చాలా తక్కువ సమయంలోనే ఆయన 'మగధీర' సినిమా చేసి, చారిత్రకాలను రాజమౌళి అద్భుతంగా తీయగలరు అనిపించుకున్నారు.

'మగధీర' సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా తరువాత ఇక రాజమౌళి వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తారని అనుకున్నారు. కానీ అలా భారీ బడ్జెట్ సినిమాలకు కట్టుబడిపోతే .. ఒకదానికి మించి మరో సినిమా చేస్తూ వెళ్లవలసి వస్తుందనే విషయాన్ని రాజమౌళి గ్రహించారు. ఇకపై బడ్జెట్ పరంగా .. కథాకథనాల పరంగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చేస్తూ వెళతానని ఒక వేదిక మీదుగా చెప్పారు. అన్నట్టుగానే 'ఈగ' .. 'మర్యాద రామన్న' సినిమాలను చేశారు. ఈ రెండు సినిమాలకు కథనే హీరో. అలాంటి సినిమాలతో అనితర సాధ్యమైన విజయాన్ని ఆయన నమోదు చేశారు.

ఆ తరువాత మాత్రం ఆయన 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలు చేశారు. జానపద కథలను తలపించే ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచపటానికి పరిచయం చేశాయి. ఇక ఇప్పుడు రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' అనే సినిమాను చేశారు. ఖర్చు పరంగా .. కంటెంట్ పరంగా ఇది 'బాహుబలి' కంటే పెద్ద సినిమా అని చెబుతున్నారు. 'అదేంటి ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు .. చిన్న సినిమాలు కూడా చేస్తానని చెప్పారు గదా? మళ్లీ భారీ సినిమాలపై నుంచి దిగడం లేదు ... తగ్గడం లేదు? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.

అందుకు రాజమౌళి స్పందిస్తూ .. "భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా చేయను .. ఎక్కువ రోజుల పాటు ఒక సినిమాను సెట్స్ పై ఉంచను .. షూటింగు కోసం ఎక్కువ సమయం తీసుకోను అని చెప్పిన మాట నిజమే .. మాట తప్పింది నిజమే. రామ్ గోపాల్ వర్మను స్ఫూర్తిగా తీసుకుని అలా అబద్ధం చెప్పాను" అంటూ ఆయన చమత్కరించారు. వర్మ ఏ మాట మీద నిలబడరు. అలా నిలబడాలనే రూల్ ఏమీ లేదు కదా అంటారు. అప్పుడు అది కరెక్టు .. ఇప్పుడు ఇదే కరెక్టు అంటారు. అలాంటి వర్మ పేరును తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!
Tags:    

Similar News