దాసరి స్థానం ఖాళీనే కానీ..

Update: 2018-04-24 14:19 GMT
తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరెడ్డి వ్యవహారం ఎంత పెద్ద వివాదంగా మారిందో తెలిసిందే. గతంలోనూ సినీ పరిశ్రమలో చాలా వివాదాలు తలెత్తాయి కానీ.. ఇప్పుడు జరిగినంత రచ్చ ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఈ ఇష్యూను సరిగా డీల్ చేసే వాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో అందరూ దర్శకరత్న దాసరి నారాయణరావును తలుచుకున్నారు. ఆయన ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. ఇండస్ట్రీ పరువు బజారున పడకుండా ఆయన చక్కగా సమస్యను డీల్ చేసేవారని.. అసలు శ్రీరెడ్డిని ఇలా రచ్చ చేయనిచ్చేవారు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సినీ జనాలు చాలామంది దాసరి లేని లోటు గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఉంటే బాగుండేదని అంటున్నారు.

కానీ దాసరి వెళ్లిపోయి ఏడాది దాటిపోయింది. ఇంకా ఆయన లేదే అనుకోవడంలో అర్థం లేదు. దాసరి స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేయాలి. కానీ ఆ బాధ్యత తీసుకోవడానికి ఎవరు ముందుకొస్తారన్నదే తెలియడం లేదు. గతంలో చిరంజీవి కొన్ని సామాజిక కార్యక్రమాలకు విరాళాలు అందించినపుడు.. దాసరి పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని తనే ముందుండి నిర్వహించినపుడు.. గుండు హనుమంతరావకు సాయం చేసినపుడు నెక్స్ట్ దాసరి ఆయనే అన్న అభిప్రాయం వినిపించింది. తనకు సంబంధం లేని కొన్ని సినీ వేడుకులకు కూడా చిరు హాజరవడంతో ఈ అభిప్రాయం బలపడింది. ఐతే సానుకూల వాతావరణంలో జరిగే కార్యక్రమాలకు హాజరవడం.. ఏదైనా ఆర్థిక సాయం అందించడం చేస్తే సరిపోదు. దాసరి కేవలం ఆ విషయాలకే పరిమితం కాలేదు. సమస్యలు తలెత్తినపుడు ముందుకొచ్చారు. చర్చలు జరిపారు. అవసరమైతే మందలించారు. సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలో అవన్నీ చేశారు. అలా చేసేవాళ్లే ఇప్పుడెవరూ కనిపించడం లేదు. ప్రస్తుత శ్రీరెడ్డి ఇష్యూ నెల రోజులకు పైగా నానుతున్నా చిరంజీవి స్పందించే పరిస్థితి లేదు. మిగతా సినీ పెద్దలూ అంతే సురేష్ బాబుకు ఈ ఇష్యూలో వాయిసే లేకపోయింది. అల్లు అరవింద్.. వర్మ చేసిన కుట్రతో ఉడికిపోయి బయటికి వచ్చాడు కానీ.. లేకుంటే ఆయనా మాట్లాడేవారు కాదు.

ఇండస్ట్రీ పెద్దగా దాసరికి దక్కిన గౌరవ మర్యాదలు చూసి చాలామందికి అసూయ కలిగిఉండొచ్చు. ఆయనలా పేరు తెచ్చుకోవాలని.. గౌరవం పొందాలని అనిపించి ఉండొచ్చు. కానీ ఆయన ఏం చేస్తే.. ఎంత కష్టపడితే.. తన పనులు మానుకుని ఎంతగా సమస్యలపై పోరాడితే ఆ పేరు వచ్చిందో గుర్తించాలి. అలాంటి కష్టాలు పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. సమస్య వస్తే మనకెందుకు వచ్చిందిలే ఈ గొడవ.. ఈ రొచ్చులోకి ఎవరు దిగుతారులే అనుకునేవాళ్లే అందరూ. ఇంకా ఎవరైనా దాసరిలాగా పోరాడటానికి ముందుకొస్తే వాళ్లను ముందు పెట్టి ఆడించడానికి చాలామంది తయారుగా ఉంటారే తప్ప నిబద్ధతతో కష్టపడేవాళ్లు.. సమస్యల్ని నెత్తినేసుకునేవాళ్లు పరిశ్రమలో కనిపించరు. కాబట్టి ఎప్పటికీ దాసరి లేని లోటు అలాగే ఉంటుంది తప్ప.. ఆ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తులు రారు.. రాబోరు అంతే.
Tags:    

Similar News