రివైండ్ : స‌త్తా చాటినా ఈ డైరెక్ట‌ర్ల‌కి ఆఫ‌ర్లేవీ

Update: 2021-12-30 04:48 GMT
ఈ ఏడాది త‌మ క‌ల‌ల‌ని సాకారం చేసుకుని స‌త్తా చాటిన ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌ మందే వున్నారు. బాక్సాఫీస్ ట్రేడ్ వ‌ర్గాల‌నే నివ్వెర ప‌రిచిన డైరెక్ట‌ర్ లు వున్నారు. స్టార్ ల‌ని డైరెక్ట్ చేసిన కొత్త ద‌ర్శ‌కులూ వున్నారు.. త‌మ సినిమాల‌తో కొత్త వాళ్ల‌నే స్టార్లుగా పాపుల‌ర్ చేసిన ద‌ర్శ‌కులున్నారు. బాక్సీఫీస్ వ‌ద్ద తొలి చిత్రంతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌నే విస్మ‌య ప‌రిచిన డైరెక్ట‌ర్లూ వున్నారు. ఈ ఏడాది సైలెంట్ గా వ‌చ్చి స‌త్తా చాటిన ద‌ర్శ‌కుల‌కు సెకండ్ ఆఫ‌ర్ ద‌క్క‌లేదు. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కులెవ‌రు. ఆ సినిమా లేంటీ అన్న‌ది ఒక సారి చూద్దాం.

ఈ ఏడాది మొత్తం 270 చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో 200 చిత్రాలు స్ట్రెయిట్ మూవీస్‌. ఈ సినిమాల్లో కొన్ని థియేట‌ర్ల‌లో విడుద‌లై అద్భుతాలు సృష్టిస్తే మ‌రి కొన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లో విడుద‌లై విజ‌యాలు సాధించాయి. కింగ్ నాగార్జున న‌టించిన `వైల్డ్ డాగ్` మూవీతో అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. 2009 లో హైద‌రాబాద్ లో జరిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలిసిన క‌థే కావ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల్లో పెద్ద ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది.

ఇదే ఏడాది విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన `దృశ్యం 2`తో మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జీతూ జోస‌ఫ్ ప‌రిచ‌యం అయ్యారు. ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఈ మూవీలాగే రానా న‌టించిన `అర‌ణ్య‌`తో త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌భు సాల్మ‌న్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యారు. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. `ఉప్పెన‌` సినిమాతో సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చారు.

తొలి సినిమాతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేశారు. అంతే కాకుండా ఈ సినిమాతో తాను ప‌రిచ‌యం చేసిన వైష్ణ‌వ్ తేజ్ ని , హీరోయిన్ కృతి శెట్టిని స్టార్ ల‌ని చేశారు. అయితే ఇప్ప‌టికీ త‌ను రెండ‌వ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌లేక‌పోతున్నారు. ఇక యాంక‌ర్ ప్ర‌దీప్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా?` అనే మూవీతో మున్నా ప‌రిచ‌యం అయ్యాడు. సినిమా భారీ హిట్ అనిపించుకోలేక‌పోయినా ద‌ర్శ‌కుడిగా మాత్రం మున్నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

చాలా రోజుల త‌రువాత అల్ల‌రి న‌రేష్‌కు హిట్ ఇచ్చిన చిత్రం `నాంది` ఈ సినిమాతో విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. తొలి చిత్రంతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమా త‌రువాత విజ‌య్ రెండ‌వ సినిమా విష‌యంలో మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త లేదు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన `ఎస్ ఆర్ క‌ల్యాణ్ మండ‌పం` చిత్రంతో శ్రీ‌ధ‌ర్ గాదె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ మూవీ మంచి విజ‌యాన్ని సాధించినా ఇంత వ‌ర‌కు ఈ ద‌ర్శ‌కుడికి రెండవ సినిమా ఇప్ప‌టికి క‌న్ఫ‌మ్ కాలేదు.

ఇక శ్రీ విష్ణు హీరోగా న‌టించిన చిత్రం `రాజ రాజ చోర‌`. ఈ సినిమాతో హాసిత్ గోలి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణే ల‌భించినా సెకండ్ ఆఫ‌ర్ మాత్రం ఇంకా ద‌రి చేర‌లేదు. `పెళ్లి సంద‌డి`తో గౌరీ రోణంకి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అయ్యింది. శ్రియ, నిత్యామీన‌న్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్క‌ర్ క‌లిసి న‌టించిన `గ‌మ‌నం` మూవీతో సుజ‌నారావు, `వ‌రుడు కావ‌లెను`తో ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం అయ్యారు. అయితే ఈ చిత్రాలేవీ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయాయి.

వీరుతో పాటు `అద్భుతం`తో మ‌ల్లిక్ రామ్‌, చావురు క‌బురు చ‌ల్ల‌గాతో కౌశిక్ , రాజా విక్ర‌మార్క‌`తో శ్రీ సారిప‌ల్లి వంటి ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం అయ్యారు. ఇంకా అలా వ‌చ్చి ఇలా వెళ్లిన సినిమాల‌తో చాలా మంది కొత్త ద‌ర్శ‌కులు ప‌రిచ‌యం అయినా పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయారు. ఇందులో స‌క్సెస్ సాధించిన వాళ్లు చాలా త‌క్కువే . అందులోనూ రెండ‌వ ఛాన్స్ ద‌క్కించుకున్న వాళ్లు లేక‌పోవ‌డం విచార‌క‌రం.


Tags:    

Similar News