#EMK : ముగించేశారు.. రెండవ సీజన్‌ చర్చ షురూ

Update: 2021-10-19 03:34 GMT
ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో టెలికాస్ట్‌ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ముగింపు దశకు చేరుకుంది. ఈ షో కోసం ఎన్టీఆర్ నాలుగు షెడ్యూల్స్ ను కేటాయించాడు. నాలుగు షెడ్యూల్స్ లో చిత్రీకరించిన స్టఫ్‌ ను వారంలో నాలుగు రోజుల చొప్పున టెలికాస్ట్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ లో పాల్గొన్నాడు. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఎవరు మీలో కోటీశ్వరులు షో కు సంబంధించిన షూటింగ్ ను ఎన్టీఆర్ ను ముగించాడనే వార్తలు వస్తున్నాయి. మరో నెల రోజుల పాటు షో టెలికాస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబుతో పాటు మరో సెలబ్రెటీ కూడా షో ముగిసే సమయం వరకు కనిపించబోతున్నారు.

మహేష్‌ బాబుతో షూట్‌ చేసిన ఎపిసోడ్ ను దీపావళి కానుకగా టెలికాస్ట్‌ చేస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ఈ షో పై చాలా ఆశలు నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన అభిమానులు కూడా ఈ షో రేటింగ్ దుమ్ము లేచి పోవడం ఖాయం అంటూ అంతా నమ్మకం పెట్టుకున్నారు. కాని వారి నమ్మకం వమ్ము అయ్యింది. జెమిని టీవీ రేటింగ్ ను రాబట్టడంలో ఘోరంగా విఫలం అయ్యింది. ఎన్టీఆర్ వంటి స్టార్‌ ను హోస్ట్ గా తీసుకుని కూడా వారు షో విషయంలో స్టార్‌ రేటింగ్‌ ను దక్కించుకోవడంలో విఫలం అయ్యారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కు కూడా ఈ షో పట్ల మొదట్లో ఉన్న ఆసక్తి తర్వాత తర్వాత కనిపించలేదు అంటూ స్వయంగా షో లో భాగస్వామ్యం అయిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతంలో బిగ్ బాస్ కు ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా వ్యవహరించిన సమయంలో రేటింగ్ తో సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాడు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సెలబ్రెటీ గెస్ట్ లు వచ్చినప్పుడు తప్ప ఇతర ఎపిసోడ్స్ ను జనాలు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. హిందీలో అమితాబ్‌ బిగ్గెస్ట్‌ షో గా ఈ షోను చేశారు.. చేస్తూనే ఉన్నారు. కాని ఎన్టీఆర్ విషయంలో మాత్రం అది వర్కౌట్‌ కాలేదు. ఎన్టీఆర్‌ పేరు ఉన్నా.. ఎన్టీఆర్‌ ఉన్నా కూడా ఈ షో తెలుగు లో వర్కౌట్‌ అవ్వదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఈ షో రెండవ సీజన్ గురించిన చర్చ మొదలు అయ్యింది. షో ప్రారంభంకు ముందే ఎన్ని సీజన్ లు చేస్తారు అంటూ ప్రశ్నించిన సమయంలో ఏమీ అనుకోలేదు.. ఇది సక్సెస్ అయితే అప్పుడు ఆలోచిస్తాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ మళ్లీ ఒప్పుకుంటాడా అంటే డౌటే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఎన్టీఆర్ నో చెప్తే జెమిని వారు ఎవరిని రంగంలోకి దించుతారు అనేది చూడాలి.




Tags:    

Similar News