'హీరో' విషయంలో ధైర్యం చేశాం!

Update: 2022-01-06 15:30 GMT
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో హీరో వచ్చేస్తున్నాడు. కృష్ణ పెద్ద కూతురు తనయుడు గల్లా అశోక్ హీరోగా 'హీరో' టైటిల్ తో సంక్రాంతికి బరిలోకి దూకేస్తున్నాడు. అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకోవడం .. ఆ విషయంలో కృష్ణ ఆశీస్సులు తీసుకోవడం .. మహేశ్ బాబు తన సపోర్ట్ ను తెలియజేస్తూ ట్వీట్ చేయడం వంటివి జరిగిపోయి చాలాకాలమే అయింది. అయితే అశోక్ హీరోగా ముందుగా ఒక కథను అనుకోవడం .. అది వర్కౌట్ కాకపోవడం జరిగింది. ఆ తరువాత ఆయన 'హీరో' అనే టైటిల్ పట్టుకుని శ్రీరామ్ ఆదిత్యతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు.

కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోవడంతో సరైన విడుదల సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సినిమా నిర్మాతగా .. కృష్ణ పెద్ద కూతురు గల్లా పద్మావతి మాట్లాడుతూ .. " ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నాము. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వలన పబ్లిసిటీకి సమయం తక్కువైంది. ఇంకా వెయిట్ చేస్తే చాలా కాలం వెయిట్ చేయవలసి వస్తుందని అనిపించింది.

మున్ముందు పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి .. అప్పుడు విడుదల చేయడం కష్టమవుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాము. సంక్రాంతి పండుగకు ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటమనేది ఒక ఆనవాయితీ. ప్రతి ఏడాది కూడా అలాగే జరుగుతూ వస్తోంది. ఇప్పుడు నాగార్జున గారు కూడా తాను తన సినిమాతో వస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. సాధారణంగా పండగకి రెండు మూడు సినిమాలు వచ్చినా బాగానే ఆడుతూ ఉంటాయి. మేము కూడా చాలా ఆలోచించి .. ధైర్యం చేసి ముందడుగు వేయడం జరిగింది.

జనవరి 15వ తేదీన ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాము. అశోక్ స్కిల్స్ .. టాలెంట్ ఏమిటనేది నిరూపించుకోనున్నాడు. నిధి చాలా టాలెంటెడ్ .. ఆమె మంచి డాన్సర్. అశోక్ జోడీగా ఆమె చాలా బాగా కుదిరింది. ఇది యూత్ ఫుల్ సినిమా అయినప్పటికీ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుంది. అలాగే మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమాలో కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమా మీ అందరినీ తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ ముగించారు.


Tags:    

Similar News