కలను నిజం చేసుకున్న బుట్టబొమ్మ!

Update: 2022-01-23 10:30 GMT
సినిమా అనేది రంగుల ప్రపంచం అనే మాట ఎప్పటి నుంచో వింటున్నదే. ఎన్నో కలలతో ఇక్కడికి ప్రతి రోజూ ఎంతో మంది వస్తుంటారు. తమ కలలను నిజం చేసుకోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. తాను కూడా అలాగే ఇండస్ట్రీకి వచ్చాననీ .. సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనే తన కలను నిజం చేసుకున్నానని స్టార్ హీరోయిన్ పూజ చెబుతోంది.  తన సొంత సంపాదనతో ఆమె ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. మొన్న శుక్రవారం రోజున గృహప్రవేశం కూడా చేసేసింది. తాను ఎప్పటి నుంచో అనుకుంటున్న సీ పేసింగ్ హౌస్ దక్కడంతో మురిసిపోతోంది.

తాజా ఇంటర్వ్యూలో  పూజ మాట్లాడుతూ .. "సౌత్ ఇండియన్స్ అందరికీ కూడా సొంత ఇల్లు అనేది ఒక కలగా ఉంటుంది. ఒక మంచి ఇంటిని సొంతం చేసుకోవాలనే ఆలోచనతోనే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అలాంటి ఒక ఆశయమే నాకూ ఉండేది. నా సొంత సంపాదనతోనే ఇల్లు కొనాలనే సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఇంతకాలానికి నిజమైంది. ముంబైలో ఇక్కడ ఈ ఇంటిని తీసుకోవాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి చాలా వరకూ దానిపైనే దృష్టి పెట్టాను. ఒక వైపున షూటింగులు చూసుకుంటూనే, మరో వైపున నా అభిరుచికి తగినట్టుగా డిజైన్ చేయించుకున్నాను.

సాధారణంగా చాలామంది ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత, ఇంటికి కావలసిన సామాగ్రిపై దృష్టి పెడతారు. నేను అలా చేయలేదు. ఒక వైపున ఇంటి నిర్మాణం జరుగుతూ ఉండగానే. మరో వైపున ఎక్కడ ఏం ఉంటుందో బాగుంటుందో మా అమ్మతో కలిసి ప్లాన్ చేసుకున్నాను. అందుకు తగిన సామాగ్రిని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ వెళ్లాను. అలా కొన్ని ఇక్కడ .. మరికొన్ని విదేశాల్లో తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఇంటిని ఇది నాది అని చెప్పుకోవాలని ఆశపడ్డానో .. అలాంటి ఇంటిని సొంతం చేసుకున్నాను. ఈ విషయంలో మా అమ్మానాన్నలు ఎంతో సపోర్ట్ చేశారు. మాకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ, నేను ఇల్లు కొనుక్కోవడం వాళ్లకి ఎంతో ఆనందాన్ని కలిగించింది.

నేను ఈ తరం అమ్మాయిలందరికి చెప్పేది ఒక్కటే .. కలలు కనండి. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి. ఏ రంగాన్ని ఎంచుకున్నప్పటికీ, అందులో ముందుకు వెళ్లడానికి మీ వంతు కృషి చేయండి. మీ పై మీరు చేసే పోరాటంలో తప్పక విజయాన్ని సాధిస్తారు. ఎవరినైనా కాపాడేది హార్డ్ వర్క్ మాత్రమే. కలలు నిజం చేసుకోవాలకునేవారు ముందుగా అనుసరించవలసిన సూత్రం కష్టపడటమే. ఈ విషయంలో ఈ తరం అమ్మాయిలకు నేను ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.  
Tags:    

Similar News