ప్రభాస్ ఓ మహాసముద్రం .. అంతే!

Update: 2021-02-08 02:30 GMT
ప్రభాస్ .. ఇప్పుడు ఈ పేరు యూత్ ను ఊపేస్తోంది .. మాస్ ఆడియన్స్ ను మంత్రిస్తోంది .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పిస్తోంది. మొరటుగా కనిపిస్తూ కరుకుగా డైలాగ్స్ చెప్పే ప్రభాస్, మాస్ హీరోగా మాత్రమే నిలదొక్కుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ అన్నివర్గాల ప్రేక్షకులు అభిమానించే హీరోగా ఎదగడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోలేదు. మంచి హైటూ .. పర్సనాలిటీ .. ఫిట్ నెస్ తో కనిపించే ప్రభాస్, అమ్మాయిల కలల్లో గ్రీకువీరుడు అని చెప్పుకోకతప్పదు. చిరంజీవి తరువాత యాక్షన్ సీన్స్ లో ఆ స్థాయిలో విజృంభించే హీరో .. విరుచుకుపడే హీరో ప్రభాస్ అని ఒప్పుకోకతప్పదు.

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ ప్రపంచపటాన్ని ఆక్రమించాడు. ఈ సినిమాలో వీరత్వం .. మానవత్వం కలిగిన రెండు పాత్రల్లో ఆయన ఇష్టంగా ఇమిడిపోయాడు. ప్రేక్షకుల మనసులకు మరింత చేరువైపోయాడు. అయితే ప్రపంచస్థాయిలో ఈ సినిమా విజయపతాకాన్ని ఎగరేసినా .. కొన్నేళ్లుగా సెట్ చేయబడిన రికార్డులను అవలీలగా అధిగమించినా ప్రభాస్ ఎప్పటిలానే ఉన్నాడు. ఆయన ఎక్కడా .. ఎప్పుడూ కూడా చింపేశాను .. పొడిచేశాను అని చెప్పలేదు. ఏ వేదికపై కూడా హడావిడి చేయలేదు. ఇలాంటి పాత్రలు ఇంతవరకూ చేయలేదు .. ఇంత బాగా చేస్తానని నేను కూడా అనుకోలేదు అనీ అనలేదు.

ప్రపంచమంతా 'బాహుబలి' విజయోత్సవాలు జరుపుకుంటూ ఉంటే .. ప్రభాస్ కి నీరాజనాలు పడుతుంటే, కేవలం చిరుమందహాసంతోనే స్వీకరించిన ఘనత ప్రభాస్ సొంతం. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'రాధేశ్యామ్' పాన్ ఇండియా సినిమానే. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న 'సలార్' .. 'ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలే. ఇక వైజయంతీ మూవీస్ బ్యానర్లో చేయనున్న సినిమా కూడా భారీదే. ఇవన్నీ కూడా వివిధ భాషల్లో .. విస్తృతమైన స్థాయిలో విడుదలయ్యేవే.

అయినా ఆ సినిమాలను గురించి ప్రభాస్ ఎక్కడా ప్రస్తావించడు. ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం సంక్షిప్తంగానే ఉంటుంది. 'డాళింగ్' అంటూ నవ్వుతూ పలకరించడం .. తనపని తాను చేసుకోవడం .. ఇవే ఆయనకు తెలిసింది. ఆ స్థాయి క్రేజ్ కలిగిన వాళ్లు అంత సైలెంట్ గా ఉండటం సాధారణమైన విషయమేం కాదు. మహాసముద్రం ప్రళయానికి ముందు .. తరువాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో, విజయానికి ముందు .. తరువాత ప్రభాస్ కూడా అంతే కూల్ గా .. సైలెంట్ గా కనిపిస్తాడు. అందుకే ప్రభాస్ ఓ మహాసముద్రం .. అంతే.


Tags:    

Similar News