ప్రభాస్ చెబుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయ్

Update: 2018-05-22 14:30 GMT
‘బాహుబలి’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ముందు ఒక మీడియం రేంజి సినిమాగానే దీన్ని అనుకున్నారు. ఈ సినిమా ఆలోచన నాలుగేళ్ల కిందటే మొదలైంది. కానీ ఈ చిత్రం మొదలయ్యే సరికి ప్రభాస్ రేంజే మారిపోయింది. ‘బాహుబలి’తో అతడి ఇమేజ్ శిఖర స్థాయికి చేరింది. మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీనికి తగ్గట్లే ‘సాహో’ స్థాయిని కూడా పెంచేశారు. నాలుగు భాషల్లో.. ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్రణాళికలు రచించారు. ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.90 కోట్లు.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంకో రూ.50 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఇందులో నిజమెంతో కానీ.. ప్రభాస్ చెబుతున్న మాటలు చూస్తుంటే ఇండియన్ సినిమాలో నభూతో అనిపించే దృశ్యాలు చూడబోతున్నామని అనిపిస్తోంది.

తన జీవితంలో ‘సాహో’ తరహా  హెవీ స్టంట్స్ ఇప్పటిదాకా చేయలేదని.. కనీసం చూడను కూడా చూడలేదని ప్రభాస్ తెలిపాడు. తన కళ్ల ముందే పెద్ద పెద్ద వాహనాల్ని పేల్చేస్తున్నారని.. ఇప్పటిదాకా ‘సాహో’ కోసం 28 ట్రక్కులు.. 5 కార్లను పేల్చారని అతను చెప్పాడు. ఆ సన్నివేశాలు చూస్తుంటే భయమేస్తోంది. సినిమా చూసినపుడు ప్రేక్షకులు కూడా తనలాగే ఫీలవుతారని అన్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇంకా తన కెరీర్లోనే అత్యంత కష్టంగా అనిపించిన బైక్ ఛేజింగ్ సీన్ ఇందులో చేశానని.. అది ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుందని అన్నాడు. ఇప్పటికే ‘సాహో’లో యాక్షన్ సన్నివేశాల గురించి చాలా చర్చ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ చెబుతున్న ఈ మాటలన్నీ వింటుంటే అభిమానుల్లో గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. క్యూరియాసిటీ మరింత పెరిగిపోతోంది. మరి ఈ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందా.. యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయా అన్నది చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం.

Tags:    

Similar News