అప్పుడే కాపీ అంటారా? ఛ‌స్‌.. ఇదేం బాలేదు!

Update: 2015-09-03 13:53 GMT
అక్క‌డెక్క‌డో వ‌చ్చిన సినిమాల్ని చూసేసి స్ఫూర్తి పేరుతో ఇక్క‌డ తీసి వ‌దులుతామంటే కుదిరే ప‌రిస్థితులు ఇప్పుడు లేవు. ఒక‌వేళ ఆ ప్రయ‌త్నం చేసినా ఎక్క‌డ్నుంచి స్ఫూర్తి పొందారో, ఏది కాపీ కొట్టారో, మ‌రేది ఫ్రీమేక్ చేశారో ఇట్టే చెప్పేస్తున్నారు జ‌నం. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ అందుబాటులోకి వ‌చ్చాక  ప్ర‌పంచం కుగ్రామం అయిపోయింది. ఏ మారుమూల దేశంలో తీసిన సినిమాని కాపీ కొట్టినా ఇక్క‌డ జ‌నాల‌కి తెలిసిపోతుంది. వెంట‌నే ఆ పోస్ట‌ర్‌నీ ఈ పోస్ట‌ర్‌నీ, ఆ టీజ‌ర్‌నీ.. ఈ టీజ‌ర్‌నీ ప‌క్క‌ప‌క్క‌నే పెట్టేసి 'ఇదిగో మీ తీత‌' అంటూ సోష‌ల్ నెట్వ‌ర్కింగ్ సైట్ల‌లో చూపెడుతున్నారు. అందుకే ద‌ర్శ‌కులు ఇప్పుడు కాపీ కొట్టాలంటే చాలా భ‌య‌ప‌డుతున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే నిన్న‌గాక మొన్న వ‌చ్చిన 'కంచె' ట్రైల‌ర్‌ ని చూసిన జ‌నాలు చాలా మంది ఇది కాపీ సినిమా అని మాట్లాడుకోవ‌డం మొద‌లెట్టారు కాబ‌ట్టి.

సినిమా చూశాక  అది కాపీనా, మ‌రొక‌టా అని చెప్పొచ్చు. కానీ కేవ‌లం ట్రైల‌ర్ చూసి అలాంటి నిర్ణ‌యానికి రావ‌డ‌మే అస్స‌లేం బాగోలేదు. కానీ కొద్దిమంది మాత్రం ఇది ప‌క్కాగా హాలీవుడ్ సినిమా 'డియర్ జాన్' ను పోలివుందని మాట్లాడుకుంటున్నారు. సినిమా అంతా కాకపోయినా 'డియర్ జాన్' థీమ్ కు 'కంచె' కొంచెమ‌యినా మ్యాచ్ అవుతుంద‌ని అంటున్నారు. 'డియ‌ర్ జాన్‌' సినిమాని కూడా ప్రేమ కధకీ, యుద్ధానికీ ముడిపెట్టి తీశారు. 'కంచె'లో కూడా అదే ఛాయ‌లు క‌నిపిస్తుండ‌టంతో అంద‌రూ ఇది స్ఫూర్తి పొందిన క‌థే అని మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. అయితే 'డియ‌ర్ జాన్‌' ఎప్పుడొచ్చిందో ఏంటో తెలియ‌దు కానీ... క్రిష్ మాత్రం 'కంచె' క‌థ‌ని ఎప్ప‌ట్నుంచో తీయాల‌నుకొంటున్నాడ‌ట‌. స్క్రిప్ట్ రాసిపెట్టుకొని కూడా కొన్నేళ్ల‌య్యింద‌ట‌. మ‌రి ఇప్పుడు కాపీ అంటే ఎలా గురూ! స‌రే... నిజాలేందో సినిమా వ‌చ్చాక తెలుస్తాయి క‌దా! 'కంచె' ట్రైల‌ర్ మాత్రం టాక్ అఫ్ ది టాలీవుడ్‌ గా మారింది. సినిమాపై ఒక్క‌సారిగా అంచనాలను పెంచేసింది. సెల‌బ్రిటీలంతా 'కంచె' ట్రైల‌ర్‌ ని భ‌లే ఇదిగా పొగుడుతున్నారు. 
Tags:    

Similar News