రాజమౌళి స్ట్రాటజీని ఫాలో అవ్వని 'రాధేశ్యామ్'..!

Update: 2022-02-02 10:30 GMT
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం మెల్ల మెల్లగా తగ్గుతోంది. పరిస్థితులు మెరుగుపడుతుండటంతో వచ్చే వారం నుంచే సాధారణ వాతావరణం నెలకొననుందని అందరూ భావిస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో వాయిదా పడిన పెద్ద సినిమాలన్నీ వరుసగా విడుదల తేదీలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రెండు రిలీజ్ డేట్స్ మీద రెండు ఖర్చీఫ్స్ అనే కొత్త సంస్కృతికి తెర లేపారు.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్.. చివరకు కొత్త రిలీజ్ డేట్ మార్చి 25 ఫిక్స్ చేసుకున్నారు. 'భీమ్లానాయక్' చిత్రాన్ని పరిస్థితులను బట్టి ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇదే క్రమంలో 'గని' సినిమాకి ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 అంటూ రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.

'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని మార్చి 25న లేదా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇలా రెండు తేదీల‌ను బ్లాక్ చేయ‌డం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆనవాయితీ అయిపోయింది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో.. మిగతా సినిమా ఎప్పుడు వస్తాయో తెలియక మేకర్స్ అందరూ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. కానీ 'రాధేశ్యామ్' మేక‌ర్స్ మాత్రం సింగిల్ రిలీజ్ డేట్ మీద‌నే ఉన్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా 'రాధే శ్యామ్' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి11వ తేదీన అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. రాజమౌళి ప్రారంభించిన రెండు తేదీల పద్ధతిని ఫాలో అవ్వకుండా.. ఒకే డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు.

కాగా, రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాధే శ్యామ్' చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో యూరప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ సంస్థలతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.
Tags:    

Similar News