నా కూతురు ల‌వ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయింది!

Update: 2018-10-01 04:26 GMT
త‌న హాస్యంతో కోట్లాది మందిని న‌వ్వించిన న‌టుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌ ను చెప్పాలి. కామెడీ హీరోగా ఆయ‌న చేసిన చిత్రాల‌న్నీ ఒక ఎత్తు అయితే.. కొంత గ్యాప్ త‌ర్వాత ఆయ‌న చేసిన మీ శ్రేయోభిలాషి.. ఆ న‌లుగురు లాంటి కొన్ని సినిమాలు  ఆయ‌న్ను ఎవ‌రితోనూ పోల్చ‌లేనంత ఉన్న‌త స్థాయిలో కూర్చోబెట్టాయి.

న‌టకిరిటీగా సుప‌రిచితుడైన ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం బేవ‌ర్స్. పేరు కాస్త తేడాగా ఉన్న‌ట్లు అనిపించినా.. కాస్త విష‌యం ఉన్న సినిమాగా చెబుతున్నారు. ర‌మేశ్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం తాజాగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎప్పుడూ లేని రీతిలో ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న వ్య‌క్తిగ‌త అంశాల్ని వెల్ల‌డించారు. త‌న కుమార్తె చేసిన ప‌నిని గుర్తు చేసుకుంటూ.. త‌ల్లి లేనోడు త‌న త‌ల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడ‌ని.. త‌న ప‌దో ఏట‌నే త‌న త‌న త‌ల్లి చ‌నిపోయిన‌ట్లు చెప్పారు. త‌న‌కు ఒక్క‌తే కుమార్తె అని.. పేరు గాయత్రి అని చెప్పారు. ఆమెతో తాను మాట్లాడ‌న‌ని.. ఎందుకంటే ఆమె ల‌వ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయింద‌న్నారు.

ఇవ‌న్నీ మామూలు విష‌యాలే అయినా.. ఈ సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ రాసిన పాట విన్నాక మాత్రం త‌న కుమార్తెను ఇంటికి పిలిపించి.. ఈ పాట‌ను నాలుగైదుసార్లు వినిపించిన వాడినన్న ఆయ‌న‌.. త‌న త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు కూడా తాను ఎడ‌వ‌లేద‌న్నారు.

కానీ కూతురు వెళ్లిపోయిన‌ప్పుడు మాత్రం ఏడ్చాన‌న్నారు. త‌ల్లీ త‌ల్లీ చిట్టిత‌ల్లీ.. నా ప్రాణాలే పోయాయ‌మ్మా అంటూ సుద్దాల రాసిన ఈ పాట త‌న‌కెంతో న‌చ్చింద‌న్నారు. మీకు మ‌న‌సు అనేది ఉంటే.. ఈ పాట‌ను జ‌న్మ‌లో మ‌ర్చిపోలేర‌న్న ఆయ‌న‌.. త‌న కంటే చిన్నోడు కాబ‌ట్టి సుద్దాల కాళ్ల‌కు దండం పెట్ట‌లేద‌న్నారు.

బేవార్స్ టైటిల్ ఏంటి? అని అనుకుంటారు కానీ.. పేరెంట్స్ ను అర్థం చేసుకోలేని పిల్ల‌లే బేవార్స్ కాదు.. పిల్ల‌ల్ని అర్థం చేసుకోలేని త‌ల్లిదండ్రులు కూడా బేవార్సే అన్నారు. ఎప్పుడూ వ్య‌క్తిగ‌త విష‌యాల్ని ప్ర‌స్తావించ‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌రీ ఇంత‌లా భావోద్వేగానికి గురి కావ‌టం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Watch Here : https://www.youtube.com/watch?v=h80mSnkwD88

Tags:    

Similar News