సెట్స్ లో అడుగుపెట్టడానికి రెడీ అయిన ఉస్తాద్..!

Update: 2022-09-30 04:08 GMT
ఉస్తాద్ రామ్ పోతినేని ఇటీవల 'ది వారియర్' సినిమాతో భారీ ప్లాప్ అందుకున్నాడు. దీంతో తెలుగు తమిళ భాషల్లో సత్తా చాటాలనుకున్న ఎనర్జిటిక్ హీరోకి నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి, సక్సెస్ ట్రాక్ ఎక్కాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఇప్పటికే ఓ పాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాత్కాలికంగా #BoyapatiRapo #Rapo20 వంటి వర్కింగ్ టైటిల్స్ తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

అయితే సెట్స్ మీదకు వెళ్లడం లేట్ అవుతుండటంతో సోషల్ మీడియాలో పలు రూమర్స్ వస్తున్నాయి. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇటీవల రామ్‌ తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించడంతో.. బోయపాటి చిత్రం వెనక్కి వెళ్లిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.

బోయపాటి శ్రీను గతేడాది నందమూరి బాలకృష్ణ తో 'అఖండ' సినిమా తీసి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నాడు. అయితే ఈ మూవీ వచ్చి తొమ్మిది నెలలు దాటిపోయినా.. ఇంత వరకూ కొత్త సినిమాని మొదలుపెట్టలేదు. అయితే బోయపాటి ఎట్టకేలకు రామ్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ కు ముహూర్తం ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది.

దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 6వ తేదీన రామ్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని బోయపాటి నిర్ణయించుకున్నారట. మంచి రోజులు - శుభ గడియలపై విశ్వాసం కలిగి ఉండే దర్శకుడు.. ఇప్పుడు రాపో20 సినిమా విషయంలోనూ వాటినే అనుసరిస్తున్నారని అంటున్నారు.

దీని వల్లనే సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదని చెబుతున్నారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్న ప్రత్యేకమైన సెట్‌ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు ఏకధాటిగా ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.

కాగా, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'ఏజెంట్' ఫేమ్ సాక్షి వైద్య ని హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది.

ఊర మాస్ దర్శకుడు మరియు ఎనర్జిటిక్ హీరో కలిసి చేయబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది దర్శక హీరోలిద్దరికీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News