రాపాక కెరీర్ క్లోజ్ యేనా?

Update: 2021-05-24 16:30 GMT
ఏపీలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు. జనసేనాని పవన్ ఓడిపోయినా రాజోలు జనసేన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచాడు. జనసేన చరిత్రలోనే తొలి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక మాత్రం జనసేనకు హ్యాండ్ ఇచ్చి వైసీపీకి , జగన్ కు జైకొట్టారు.

అయితే వైసీపీకి మద్దతు తెలిపిన రాపాక వల్ల ఆయన నియోజకవర్గం రాజోలులో చిచ్చు రేగింది. వైసీపీలో రాజోలు వైసీపీ నియోజకవర్గ నేతలుగా అమ్మాజీ, బొంతు రాజేశ్వరరావు వంటి వారి మధ్య విభేదాలు, విరోదాలు మరింత పెరిగేలా రాపాక వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

పవన్ ను దెబ్బతీయాలని మొదట్లో రాపాకను జగన్ ఆదరించారు. ఆ తర్వాత ఇప్పుడసలు వైసీపీ, జగన్ పట్టించుకోవడమే మానేశారట.. ఇటీవల స్థానిక ఎన్నికల్లో రాపాక వైసీపీకి మద్దతు తెలిపినా అక్కడ జనసేన అభ్యర్థులు గెలిచారు. రాపాక వ్యూహాలు బెడిసికొట్టాయి. వైసీపీ కేడర్ కూడా రాపాకకు సహకరించడం లేదు. దీంతో రాజోలులో జనసేన భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో జగన్ , వైసీపీ కూడా రాపాకను పక్కనపెట్టినట్టుగా తెలుస్తోంది.

ఇక రాజోలులో వైసీపీ నుంచి పోటీచేసిన బొంతు రాజేశ్వరరావు తన పట్టును నిలుపుకుంటున్నారు. బొంతును కాదని రాపాకకు వైసీపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేస్తామని అక్కడి నేతలు చెబుతున్నారు.

రాజోలులో బలంగా ఉన్న క్షత్రియ, కాపులు అంతా జనసేన వైపు తిరిగారు. వచ్చే ఎన్నికల్లో రాపాక ఓటమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. మొత్తంగా చూస్తే.. అటు జనసేన.. ఇటు వైసీపీ కూడా రాపాకను దూరం పెడుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు రాపాక రాజకీయం ఇక క్లోజ్ అయినట్టేనని చెబుతున్నారు.
Tags:    

Similar News