గబ్బర్ సింగ్-2 ఎందుకు మార్చినట్లు?

Update: 2015-07-23 23:16 GMT
గబ్బర్ సింగ్.. మొదట ఈ టైటిల్ పెట్టినపుడు ఇదేంటి పవన్ కళ్యాణ్ హిందీ టైటిల్ పట్టుకొచ్చాడు అని అదోలా మాట్లాడుకున్నారు జనాలు. కానీ సినిమా చూశాక సినిమాకు సరైన టైటిల్ పెట్టారని ప్రేక్షకులు ఒప్పుకున్నారు. తర్వాత తర్వాత గబ్బర్ సింగ్ అనే టైటిల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ అనే టైటిల్ తో ఇంకో సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిదిప్పుడు గబ్బర్ సింగ్ సీక్వెల్ కు ఆ పేరు కాకుండా కొత్తది పెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంత పాపులర్ టైటిల్ని పవన్ ఎందుకు వదిలేశాడో జనాలకు అర్థం కావడం లేదు.

ఐతే గబ్బర్ సింగ్-2 టైటిల్ని ‘సర్దార్’గా మార్చడానికి మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఈ టైటిల్ విషయంలో ఇంతకుముందు నెలకొన్న వివాదం. గతంలో గబ్బర్ సింగ్ మొదలైనపుడు ఈ టైటిల్ రిజిస్టర్ చేసిన ముంబయి నిర్మాత ఒకరు కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ వ్యక్తికి డబ్బులిచ్చి సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే తలనొప్పి మరోసారి ఉండకూడదనే టైటిల్ మార్చి ఉండొచ్చంటున్నారు. మరోవైపు ఈ కథకు, గబ్బర్ సింగ్ కథకు ఏం సంబంధం లేదని.. దీన్నసలు సీక్వెల్ అని చెప్పడం కూడా కష్టమని.. అలాంటపుడు గబ్బర్ సింగ్-2 అన్న టైటిల్ సరికాదని భావించి కొత్త టైటిల్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఇక మూడో కారణం.. సెంటిమెంటు. ఇంతకుముందు ఆర్య, గాయం, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలకు సీక్వెల్స్ తీసి.. పాత పేర్లే కలిసొచ్చేలా టైటిల్స్ పెట్టారు. అవి ఫ్లాపయ్యాయి. అందుకే కొత్త టైటిల్ ఎంచుకుని ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మూడింట్లో అసలైన కారణం ఏంటో మరి.
Tags:    

Similar News