అధిక రెమ్యూనరేషన్‌ తీసుకునే స్టార్ హీరోలను ఏకిపారేసిన ఆర్జీవీ..!

Update: 2022-04-16 03:49 GMT
ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ ఇండస్ట్రీ ఆధిపత్యం కొనసాగుతోందని అనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణాది చిత్రాలకు ఇప్పుడు నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. దీంతో చాలా వరకూ తెలుగు సినిమాలన్నీ హిందీలోనూ విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు స్టార్స్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

'బాహుబలి' 'బాహుబలి 2' 'సాహో' 'పుష్ప' వంటి సినిమాలు ఉత్తరాదిలో మంచి ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన RRR మూవీ నార్త్ సర్క్యూట్స్ లో 250 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇక లేటెస్ట్ ఎంట్రీ ''కేజీయఫ్: చాప్టర్ 2'' మూవీ కూడా బాలీవుడ్ లో సత్తా చాటుతోంది.

'కేజీయఫ్ 2' సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే దాదాపు రూ. 53.95 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. రెండు రోజుల్లో 100 కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కేజీఎఫ్' చిత్రాన్ని ప్రశంసిస్తూ బాలీవుడ్ ను ఏకిపారేస్తూ వరుసగా ట్వీట్లు పెడుతున్నారు.

“స్టార్ల రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యమైన మరియు బిగ్గెస్ట్ హిట్లు వస్తాయి అనడానికి 'KGF 2' మాన్ స్టర్ హిట్టే స్పష్టమైన నిదర్శనం” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. అత్యధిక రెమ్యునరేషన్స్ తీసుకునే స్టార్ హీరోలపై వర్మ పరోక్షంగా సెటైర్ వేశారని అర్థం అవుతోంది.

భారీ బడ్జెట్ సినిమాలు అంటే స్టార్ హీరోలకు అధిక పారితోషికాలు ఇవ్వడం కాదని.. హీరోలకు భారీ రెమ్యునరేషన్స్ చెల్లించడం వృధా అని.. దీనికి బదులుగా మేకింగ్ మీద ఖర్చు చేస్తే మంచి క్యాలిటీ కంటెంట్ వస్తుందని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడుతున్నారని తెలుస్తుంది.

హిందీ చిత్ర పరిశ్రమను మరచిపోండి.. తెలుగు మరియు తమిళ ఫిలిం ఇండస్ట్రీలు కూడా KGF సినిమా వచ్చే వరకు వరకు కన్నడ సినీ పరిశ్రమను సీరియస్‌ గా తీసుకోలేదని.. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ దానిని ప్రపంచ పటంలో ఉంచాడని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

''రాకీ భాయ్ విలన్‌లను మెషిన్ గన్ తో కాల్చడానికి ముంబైకి ఎలా వస్తాడో.. యష్ అక్షరాలా బాలీవుడ్ స్టార్స్ ఓపెనింగ్ కలెక్షన్లను మెషిన్ గన్ తో కాలుస్తున్నాడు. దీని ఫైనల్ కలెక్షన్స్ శాండల్‌ వుడ్ నుండి బాలీవుడ్‌ పై విసిరిన అణు బాంబు అవుతుంది'' అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు వర్మ.

'''ప్రశాంత్ నీల్ యొక్క KGF2 కేవలం గ్యాంగ్‌ స్టర్ చిత్రం మాత్రమే కాదు.. ఇది బాలీవుడ్ పరిశ్రమకు హారర్ చిత్రం కూడా. రాబోయే సంవత్సరాల్లో దాని విజయం గురించి వారు పీడకలలు కంటారు'' అని రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. ఇంతకముందు 'బాహుబలి' 'RRR' 'కేజిఎఫ్-2' వంటి సౌత్ సినిమాలు బీటౌన్ లో రికార్డులను బ్రేక్ చేయడం గురించి కూడా వర్మ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

''కన్నడ డబ్బింగ్ చిత్రం KGF2 మరియు తెలుగు డబ్బింగ్ చిత్రం బాహుబలి-2 హిందీ సినిమా చరిత్రలో ఇంత పెద్ద ఓపెనర్‌ గా ఎలా నిలుస్తాయనే దాని గురించి హిందీ ఫిలిం ఇండస్ట్రీ ( బాలీవుడ్) ఆలోచిస్తుందని మీరు భావిస్తున్నారా ???'' అని ఆర్జీవీ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

ఒక వేళ మాస్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్లు హిందీ నుండి పుట్టగలిగితే.. వారు ఉత్తరాది అంతర్భాగాల నుండి వచ్చే కొత్తవారు అవచ్చు కానీ.. ముంబై నగరానికి చెందినవారు మాత్రం కాదని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారాయి.
Tags:    

Similar News