‘2.0’కు అన్నీ అక్కడే..

Update: 2017-09-03 09:55 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా షూటింగ్ అంటే అంత వీజీ కాదు. ఆయన బయటెక్కడ కనిపించినా.. అభిమానులు షూటింగ్ సజావుగా సాగనివ్వరు. దక్షిణాదిన ఓపెన్ ఏరియాల్లో రజినీ సినిమా షూటింగ్ అంటే చాలా కష్టమవుతుంది. ఐతే ‘2.0’ లాంటి లార్జ్ స్పాన్ ఉన్న సినిమాను ఎక్కడ పడితే అక్కడ తీయడం కూడా కష్టమే. తమకు అత్యంత సౌకర్యంగా ఉండే.. విశాల ప్రదేశంలో షూట్ చేయాల్సి ఉండటంతో అన్ని రకాలుగా ఆలోచించుకుని ఏకంగా 150 ఎకరాల స్థలాన్ని లీజుకు తీసుకుందట చిత్ర బృందం. చెన్నై శివార్లలోని పూనమల్లిలో ఈవీసీ వరల్డ్ అనే థీమ్ పార్క్ ఉండేది. అది రెండేళ్ల కిందట మూతపడింది.

ఈ ప్రాంతాన్నే ‘2.0’ కొన్నేళ్ల కాలానికి లీజుకు తీసుకుందట. అందుకోసం కొన్ని కోట్ల రూపాయలు చెల్లించిందట. ఈ 150 ఎకరాల స్థలంలో భారీ సెట్టింగ్ వేయించుకుని సుదీర్ఘ కాలం షూట్ చేశారు. ఒక మొబైల్‌ ఫోన్‌ స్టోర్‌ సెట్‌.. మిలిటరీ ట్యాంకర్ల సెట్.. రోబోల యూనిట్.. ఇలా అనేక భారీ సెట్లను అక్కడ నిర్మించినట్లు సమాచారం. షూటింగ్‌ కోసమే కాక సినిమాకు సంబంధించిన అనేక పనుల కోసం భవనాలు - బస చేయడానికి వీలుగా ప్రత్యేక గదులు కూడా నిర్మించుకున్నారట. వేరే ప్రదేశాల్లో తీసిన సన్నివేశాలకు సంబంధించి ఏదైనా ప్యాచ్ వర్క్ ఉన్నా కూడా ఈ ఈవీసీ వరల్డ్‌ లోనే సెట్‌ వేసి.. మ్యాచింగ్‌ సీన్స్‌ తీసేవారట. దర్శకుడు శంకర్‌ గత రెండేళ్లలో ఇంటికి వెళ్లకుండా చాన్నాళ్ల పాటు ఇందులోనే ఉండిపోయేవారట. ‘2.0’కు రూ.450 కోట్లు ఖర్చయితే.. ఇందులో సగం ఖర్చు ఈవీసీ వరల్డ్ లోనే ఖర్చు పెట్టినట్లు యూనిట్ వర్గాల సమాచారం.
Tags:    

Similar News