'RRR' ఫ్యాన్ వార్: తారక్ vs చరణ్..!

Update: 2021-06-11 04:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలు స్క్రీన్ స్పేస్ - అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. ఒకవేళ మల్టీస్టారర్ చేస్తే మాత్రం మా హీరో గొప్ప అంటూ పోలికలు పెడుతూ వారి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్'' విషయంలోనూ ఇదే జరుగుతోంది.

ఎవరూ ఊహించని విధంగా నందమూరి - మెగా ఫ్యామిలీలకు చెందిన ఇద్ద‌రు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్ పై చూపించాలని దర్శకధీరుడు రాజమౌళి నిర్ణయించుకున్నారు. చరిత్రలో రియల్ గా కలవని ఇద్దరు విప్లవవీరులు కలిస్తే వారి మధ్య స్నేహం ఎలా ఉంటుంది.. ఇద్దరూ కలిసి ప్రజల కోసం ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు.

అయితే 'RRR' ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మెగా - నందమూరి ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తూనే ఉంది. సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చిన ప్రతిసారి వీరి మధ్య మాటల యుద్ధం అనేది కామన్ గా మారిపోయింది. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి ఎన్టీఆర్ - చరణ్ అభిమానుల మధ్య రచ్చ మొదలైంది. రాజమౌళి గతంలో తమిళ హీరో సూర్య - తారక్ కాంబోలో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే రూమర్ ని పట్టుకొని ఫ్యాన్ వార్ నడుస్తోంది.

సూర్య స్థానంలో రామ్ చరణ్ ను తీసుకోడానికి డీవీవీ దానయ్య ద్వారా చిరంజీవి లాబీయింగ్ చేశారని.. రాజమౌళి - తన అభిమాన హీరోతో కలిసి ఈఈజీగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేసారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలానే 'జంజీర్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి మెగా అభిమానులు కూడా ధీటుగానే సమాధానం చెబుతున్నారు. ఎన్టీఆర్ కు బ్రేక్ ఈవెన్ ఇవ్వడం కోసమే సూర్యతో పాడింగ్ చేయాలని రాజమౌళి అనుకున్నారని.. సూర్య కు ప్లాప్స్ రావడంతో ఆయన స్థానంలో చరణ్ ను తీసుకొచ్చి తారక్ కు సహాయం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.

నిజ జీవితంలో స్నేహితులైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇద్దరూ అన్నదమ్ములుగా కలిసిపోయి సినిమా చేస్తున్నా.. వారి అభిమానులు మాత్రం నెగిటివ్ కామెంట్స్ తో హీరోల స్థాయిని తగ్గిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా విడుదల దగ్గర పడే కొద్దీ ఎలా ఉంటుందో.. 'ఆర్.ఆర్.ఆర్' రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో అని ఇతర హీరోల ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News