బాలీవుడ్ కు RRR హార్ట్ 'ఎటాక్'..!

Update: 2022-04-01 04:30 GMT
తెలుగు సినిమా అంటే ఇప్పుడు ప్రాంతీయ సినిమా కాదు.. పాన్ ఇండియా మూవీ. దేశం మొత్తం ఇప్పుడు మన సినిమా వైపు చూస్తోందనడంలో అతిశయోక్తి లేదు. 'బాహుబలి' చిత్రంతో భాష - ప్రాంతం అనే సరిహద్దులు చెరిపేసి దర్శకధీరుడు రాజమౌళి వేసిన మార్గంలో ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమ అంతా ముందుకు సాగుతోంది.

అయితే ఓవైపు సౌత్ సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంటే.. మరోవైపు హిందీ సినిమాలు మాత్రం వెలవెల బోతున్నాయి. మన సినిమాలు భారీ ఎత్తున రిలీజై వరల్డ్ వసూళ్ల సునామీ సృష్టిస్తుంటే.. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోతున్నాయి.

ఒకప్పుడు సౌత్ సినిమాలంటే బాలీవుడ్‌ లో అంతగా పాపులారిటీ ఉండేది కాదు. ఎందుకంటే హిందీ వారికి ఉన్నంత మార్కెట్ సౌత్ సినిమాలకు ఉండేది కాదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మన సినిమాల రిలీజ్ డేట్స్ ని చూసి.. హిందీ ఫిలిం మేకర్స్ తమ చిత్రాల విడుదల ప్లాన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ సౌత్ సినిమాలతో పోటీగా తీసుకొచ్చినా.. థియేటర్లలో తట్టుకొని నిలబడలేకపోతున్నాయి.

అయితే ప్రస్తుతం ఇండియన్ సినిమాపై సౌత్ ఆధిపత్యం చేలాయిస్తుండటం బీటౌన్ వాళ్ళకు రుచించడం లేదు. తమ సినిమాలను పక్కకునెట్టి బాక్సాఫీస్‌ ను ఏలడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. గతేడాది చివర్లో వచ్చిన ‘83’ లాంటి పెద్ద సినిమా 'పుష్ప: ది రైజ్' హిందీ వెర్షన్ ధాటికి నిలవలేక పోయింది.

భారీ అంచనాలతో వచ్చిన హిందీ సినిమాపై.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మన సినిమా నార్త్ సర్క్యూట్స్ లో డామినేషన్ చూపించింది. ఇక 'కేజీఎఫ్ 2' చిత్రాన్ని చూసే 'లాల్ సింగ్ చద్దా' వంటి సినిమా వెనక్కి తగ్గిందనే టాక్ ఉంది.

ఇప్పుడు ఉత్తరాదిలో RRR హవా కొనసాగుతోంది. విడుదలకు ముందు హిందీలో ఎలాంటి హడావుడి లేదని కామెంట్లు చేశారు కానీ.. రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. నార్త్ మార్కెట్ లో ఆరు రోజుల్లోనే 120 కోట్లకు పైగా వసూళ్ళతో దూసుకుపోతోంది.

దీంతో రాజమౌళి సినిమా దెబ్బకు 'బచ్చన్ పాండే' వంటి అగ్ర హీరో నటించిన సినిమా వాష్ ఔట్ అయింది. బాక్సాఫీస్ భారీ కలెక్షన్స్ అందుకుంటున్న 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ప్రభావాన్ని తగ్గించింది కూడా ట్రిపుల్ ఆర్ సినిమానే. ఇప్పుడు కొత్త రిలీజుల మీద కూడా ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ఎఫెక్ట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.

జాన్ అబ్రహాం స్వీయ నిర్మాణంలో రూపొందిన 'ఎటాక్' సినిమాకు ఇప్పుడు RRR హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ పార్ట్-1 ను ఈరోజు (ఏప్రిల్ 1) శుక్రవారం థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

అయితే గత వారం వరకూ ధైర్యంగానే ఉన్న 'ఎటాక్' మేకర్స్ కు RRR భయం వెంటాడుతోంది. నార్త్ లో జక్కన్న సినిమా మెజారిటీ థియేటర్లను ఆక్రమించి స్ట్రాంగ్ గా నిలబడడం వారిని కలవరపెడుతోంది. మాస్ ఏరియాల్లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సాధారణ రోజుల్లోనూ మంచి వసూళ్ళు సాధిస్తోంది.

రెండో వారంలో మరిన్ని కలెక్షన్స్ ఖాయమని.. తక్కువ రోజుల్లోనే 200 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు 'ఎటాక్ పార్ట్-1' అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. RRR సినిమాను తట్టుకొని ఎలా నిలబడగలదనేది సందేహమే.

ఒకవేళ టాక్ కొంచం అటు ఇటు అయితే మాత్రం భారీ బడ్జెట్ సినిమా 'ఎటాక్' గురించి మర్చిపోవాల్సిందే. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ప్రాంతీయ సినిమాలపై హీరో జాన్ అబ్రహాం స్పందించిన తీరు చూస్తే.. బాలీవుడ్ ప్రముఖులకు మన సినిమాల డామినేషన్ మింగుడు పడటం లేదనేది అర్థం అవుతోంది.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సలార్' చిత్రంలో జాన్ అబ్రహం సపోర్టింగ్ రోల్ పోషించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విలేఖరులు ఎటాక్ హీరోని ఇదే విషయం మీద ప్రశ్నించారు. దీనికి జాన్ స్పందిస్తూ.. తానొక హిందీ యాక్టర్ అని.. తెలుగు సినిమాల్లో నటించనని అన్నారు.

"ఇతర నటీనటుల మాదిరిగా తెలుగు లేదా మరో ప్రాంతీయ భాషా చిత్రంలో నేనెప్పటికీ నటించను. నేనొక హిందీ సినిమా హీరోని. నటుడిని కాబట్టి ఏదో ఒక సినిమాలో స్క్రీన్ పై కనిపించాలనే ఉద్దేశంతో సెకండ్ హీరోగా చేయను" అని జాన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జాన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలయిన తర్వాత భాషతో సంబంధం లేకుండా దర్శకనిర్మాతలు, నటీనటులు సినిమాలు చేస్తున్నారు. కానీ జాన్ అబ్రహాం లాంటి బాలీవుడ్ హీరోలు మాత్రం ఇంకా సౌత్ సినిమాలను తక్కువ చేసి చూస్తున్నట్టుగానే అతని కామెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. బాలీవుడ్ పై సౌత్ సినిమాల దండయాత్రను జీర్ణించుకోలేక.. కుళ్ళుతో ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News