నైజాం గడ్డపై సెంచరీతో చరిత్ర సృష్టించిన RRR..!

Update: 2022-04-06 08:30 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రుధిరం రణం) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్స్ కలిసి నటించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన RRR.. 'బాహుబలి 2' రికార్డును పది రోజుల్లోనే అధిగమించింది. ఇప్పుడు నైజాం ఏరియాలో ఎవరూ ఊహించని వసూళ్ళు అందుకుని చరిత్ర సృష్టించింది. కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుంది.

దీంతో ఈ అరుదైన ఫీట్ సాధించిన తొలి సినిమాగా RRR నిలిచింది. ఇంతకముందు 68 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి 2' రికార్డును బ్రేక్ చేసి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నెలకొల్పింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 100 కోట్లు వస్తే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లు రాబట్టడమే కాదు.. ఒక్క నైజాం గడ్డ మీదే 100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది ట్రిపుల్ ఆర్.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని నైజాంలో స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు విడుదల చేసారు. 70-80 కోట్ల మధ్య ఈ సినిమాని దక్కించుకున్నట్లు టాక్. అయితే ఇప్పుడు 12 రోజుల్లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని లాభాల బాట పట్టారు. రాబోయే రోజుల్లో వచ్చే వసూళ్లన్నీ అదనంగా వచ్చే లాభాలే.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో RRR సినిమాకు మొదటి పది రోజులు టికెట్ రేట్లు పెంచుకోడానికి అనుమతి ఇవ్వడంతో 200 కోట్లు.. 100 కోట్లు వసూళ్ళు సాధ్యమయ్యాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదైతేనేం మాస్టర్ స్టోరీ టెల్లర్ జక్కన్న సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోందనేది అర్థం అవుతోంది. మరి ఫైనల్ రన్ లో ఎలాంటి నంబర్ ను పెడుతుందో..ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టారు. అజయ్ దేవగన్ - అలియా భట్ వంటి బాలీవుడ్ స్టార్స్ కూడా వీరికి జత కలిశారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tags:    

Similar News