సైన్స్ ఫిక్ష‌న్.. ఫిక్ష‌న్ జాన‌ప‌ద పితామ‌హ‌

Update: 2019-10-08 06:38 GMT
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జాన‌ప‌ద చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా విఠాలా చార్య‌- క‌మ‌లాక‌ర కామేశ్వ‌ర‌రావు వంటి ద‌ర్శ‌కులు నిలిచారు. కె.వి.రెడ్డి.. ఎల్వీ ప్ర‌సాద్ వంటి నిర్ధేశ‌కుల అండ‌తో ఎన్నో ప్ర‌యోగాలు చేశారు నాటిత‌రం ద‌ర్శ‌కులు. ఆ తరం ద‌ర్శ‌కుల త‌రువాత సింగీతం శ్రీ‌నివాస‌రావు భైర‌వ‌ద్వీపం వంటి క్లాసిక్ ని 90ల‌లోనే అందించి ఘ‌న‌త వ‌హించారు. ఆదిత్య 369లాంటి ఫిక్ష‌న్ సినిమాని తెర‌కెక్కించిన మేధావిగా పాపుల‌ర‌య్యారు. అటుపై కోడిరామ‌కృష్ణ కూడా బాల‌కృష్ణ‌తో ఓ జాన‌ప‌ద చిత్రాన్ని ప్ర‌య‌త్నించాడు. దీని కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ లు కూడా నిర్మించారు కానీ బాల‌కృష్ణ‌కు.. నిర్మాత ఎస్‌. గోపాల్‌రెడ్డికి ఏర్ప‌డిన ఈగో క్లాషెష్ కార‌ణంగా ఆ సినిమా ఆరంభ ద‌శ‌లోనే ఆగిపోయింది. దీంతో ఈ త‌రంలో జాన‌ప‌ద చిత్రాలు తీసే ద‌ర్శ‌కులు క‌ష్ట‌మే అనుకున్నారంతా.

ఆ అనుమానాల‌ని ప‌టాపంచ‌లు చేస్తూ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరున్న ఎస్.ఎస్.రాజ‌మౌళి `బాహుబ‌లి`తో ఫిక్ష‌న‌ల్ హిస్టారిక‌ల్ జాన‌పద‌ చిత్రాల‌కు నేనున్నాన‌ని నిరూపించాడు. ఒక అంద‌మైన చంద‌మామ క‌థ‌ను.. ఫిక్ష‌న‌లైజ్ చేసి మారిన అధునాత‌న టెక్నాల‌జీతో రాజ‌మౌళి- విజ‌యేంద్ర ప్ర‌సాద్ బృందం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక ఈ త‌ర‌హా చిత్రాల‌కు రాజ‌మౌళి ఒక్క‌డేనా అనుకుంటున్న వేళ `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి`తో తానూ రేసులో వున్నాన‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ నిరూపించాడు. బాల‌కృష్ణ లాంటి మాస్ హీరోని ష‌టిల్డ్ గా రారాజుగా చూపించ‌డంలో అత‌డి ప‌నిత‌నానికి పేరొచ్చింది. టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డంలో క్రిష్ చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ప‌రిశ్ర‌మ గుర్తించింది.

వీరిద్ద‌రికి తోడు `సైరా న‌రసింహారెడ్డి`తో సురేంద‌ర్ రెడ్డి కూడా వీరి జాబితాలో చేరిపోయాడు. చ‌రిత్ర‌కు చిన్నపాటి ఫిక్ష‌న్ జోడించి సురేంద‌ర్ రెడ్డి పెద్ద స‌క్సెస‌య్యారు. రాయ‌ల‌సీమ అంటే ఫ్యాక్ష‌న్ ఒక్క‌టే కాదు.. గొప్ప స‌మ‌ర‌యోధుడి చ‌రిత్ర దాగి ఉంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉద్భ‌వించిన గ‌డ్డ ఇది అని చెప్ప‌క‌నే చెప్పారు. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌లో నాటి ప‌ల్లెటూరి జాన‌ప‌దుల్ని ఆ ఛాయాచిత్రాల్ని అద్భుతంగా జ‌న‌రంజ‌కంగా క‌ళాత్మ‌కంగా సురేంద‌ర్ రెడ్డి వెండితెర‌పై తీర్చిదిద్దార‌న‌డంలో సందేహం లేదు. ఆ ముగ్గురు ద‌ర్శ‌కులు హాలీవుడ్ రేంజు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి చాలా క‌ష్ట‌త‌ర‌మైన క‌థ‌ల్ని ఎంచుకుని మునుపెన్న‌డూ తీయ‌ని స్థాయిలో భారీ స్పాన్ తో చిత్రాల్ని తెర‌కెక్కించారు. జాన‌ప‌ద చిత్రాల్నిఈ తరం ద‌ర్శ‌కులు కూడా తీయ‌గ‌ల‌మ‌ని నిరూపించారు. జాన‌ప‌దాల‌తో పాటు పౌరాణికాల్ని తెర‌కెక్కించే ద‌మ్ము వీరికి ఉంది. మారిన టెక్నాల‌జీలో రామాయ‌ణ‌- మ‌హాభార‌త‌-గ‌రుడ పురాణం వంటి పౌరాణికాల్ని ఇక‌పై తెర‌కెక్కించే వీలుంద‌ని సంకేతం అందించింది ఈ ముగ్గురే.

ఈ స్థాయి చిత్రాల్ని తెర‌పైకి తీసుకురావం అంత ఈజీ కాదు. చాలా శ్ర‌మించి.. దేశ విదేశాలు తిరిగి ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల కోర్చి ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. సాంకేతికంగా కూడా చాలా ఉన్న‌తంగా సినిమాలు వుండేలా చూసుకున్నారు. అదే స‌మ‌యంలో సినిమాపై ఎలాంటి ప‌ట్టుని కోల్పోకుండా వెండితెరపై తాము అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా తీయ‌గ‌లిగారు. జాన‌ప‌దుల అందాన్ని అత్యున్న‌త‌ సాంకేతికతో తాము తీసే భారీ చిత్రాల్లో ఇన్ బిల్ట్ చేయ‌డంలో అద్భుత విజ‌యం సాధించారు. చ‌క్క‌ని చంద‌మామ క‌థ‌ల్ని వీళ్లు తెర‌కెక్కించ‌గ‌ల‌రు. ఇక మీద‌ట జేమ్స్ కామెరూన్ కొట్టేసిన ఇండియ‌న్ పౌరాణికం కాన్సెప్ట్ `అవ‌తార్` (రామాయ‌ణం శ్రీ‌రాముడు.. ఆంజ‌నేయుడు స్ఫూర్తి) సీక్వెల్స్ తీసేంత స‌త్తా మ‌న‌వాళ్ల‌కు ఉంద‌ని ప్రూవైంది.రానున్న రోజుల్లో  ఈ త‌ర‌హా జాన‌ప‌ద చిత్రాల్ని .. అలాగే సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశాల్ని తెర‌పైకి తీసుకొచ్చి తెలుగు సినిమా కీర్తిని మ‌రింత‌గా పెంచ‌గ‌ల‌ర‌న‌డంలో సందేహ‌మేం లేదు. మారిన ట్రెండ్ ను అర్థం చేసుకుని నేటి త‌రానికి అవ‌స‌ర‌మైన విజువ‌ల్  వండ‌ర్స్ ని ది బెస్ట్ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి అందించ‌గ‌లిగే స‌త్తా మ‌న ద‌ర్శ‌కుల‌కు ఉంద‌ని నిరూప‌ణ అయ్యింది. అల్లు రామాయ‌ణం 3డి ట్ర‌యాల‌జీ.. హిర‌ణ్య క‌సిప (రానా) లాంటి భారీ పౌరాణికాలు పాన్ ఇండియా కేట‌గిరీలోనే తెర‌కెక్క‌నున్నాయి. ఇది మ‌రో మెట్టు అవుతుంద‌నడంలో సందేహం లేదు. ఈ ప‌రిణామం తెలుగు సినిమాకి ఆశావ‌హ ధృక్ప‌థాన్ని అందించ‌డ‌మేన‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News