ట్రోల్స్ చేసేవారిపై లీగల్ యాక్షన్ తప్పదన్న 'మంచు' టీమ్..!

Update: 2022-02-19 10:30 GMT
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. మంచు విష్ణు - లక్ష్మీలతో పాటుగా మోహన్ బాబును టార్గెట్ చేస్తూ నెటిజన్లు సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. మీమ్ రాయుళ్లు మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. మంచు ఫ్యామీలీ వాళ్ళు ట్వీట్ చేసినా ఇంటర్వ్యూలలో - సినిమా వేదికల మీద ఏం మాట్లాడినా దానిపై నెగెటివ్ పోస్టులు పెడుతూ వైరల్ చేసేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ లలో ట్రోల్స్ చేసేవారిపై.. అభ్యంతరకరమైన కంటెంట్ ను పోస్ట్ చేయడంపై మంచు విష్ణు టీమ్ సీరియస్ అయింది. మాజీ పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), నటుడు, నిర్మాత మరియు విద్యావేత్త మరియు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అత్యంత అవమానకరమైనదిగా ఎంతో బాధించేదిగా భావిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసారు.

ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత కొన్ని రోజులుగా డాక్టర్ మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు ప్రముఖ హీరో, నిర్మాత, విద్యావేత్త మంచు విష్ణుపై లెక్కలేనన్ని సోషల్ మీడియా పోస్ట్‌ లను చూడటం అసహ్యంగా ఉందని మీ దృష్టికి తీసుకురావడానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నోట్ ను విష్ణుకు చెందిన ఏవీఏ ఎంటెర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థల పేరు మీదుగా రిలీజ్ చేసారు.

''తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో సినిమా టిక్కెట్ ధరకు సంబంధించి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవలి పరిణామాల దృష్ట్యా, కొంతమంది సినీ ప్రముఖుల స్వార్థ ప్రయోజనాలు కోసం పనిచేస్తున్న కొంతమంది మోహన్ బాబు మరియు విష్ణు మంచుకు వ్యతిరేకంగా అవమానకరమైన కంటెంట్/పోస్ట్‌లను సృష్టించడంలో చురుకుగా పాల్గొంటున్నట్లు కనుగొనబడింది''

''మీ పోస్ట్‌లు కామెంట్‌లు, ఫోటోలు మరియు వీడియోలు బాధించేవిగా అవమానకరమైనవిగా ఉన్నప్పటికీ, మేము సంయమనం పాటిస్తున్నాము. కానీ మీరు భరించలేని విధంగా టార్గెటింగ్ చేస్తున్నారు. మా ఫిర్యాదును తక్షణమే పరిశీలించి, YouTube - Facebook - Instagram - Twitter లలో దుర్వినియోగమైన మరియు హాని కలిగించే కంటెంట్‌ ను తొలగించమని మేము మీ సంస్థ/ఛానల్/ప్రొఫైల్/పేజీలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాము''

''తక్షణ చర్య కోసం ప్లాట్‌ఫారమ్‌ కు మీరు అప్‌లోడ్ చేసిన లింకుల వివరాలను కూడా మేము అందజేస్తున్నాము. యాక్షన్ తీసుకోకుండా వాటిని నివారిస్తున్నాము. మీరు వెంటనే వాటిని తొలగించకపోతే ఈ సమస్యపై చట్టపరమైన చర్యలను ఆశ్రయించవలసి వస్తుందని పేర్కొనడానికి మేము చింతిస్తున్నాము. మేము మీ సంస్థపై పరువు నష్టం దావా వేసి రూ. 10 కోట్ల మేరకు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసే స్థాయికి వెళ్తాము. లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత దాడికి దిగడం అనేది స్పష్టంగా సైబర్ నేరాలకు సమానం కాబట్టి.. మేము పరిహారం కోసం సంబంధిత పోలీసు అధికారులను కూడా సంప్రదిస్తాము'' అని మంచు విష్ణు టీం ప్రకటనలో పేర్కొన్నారు.
Tags:    

Similar News