మా షారూక్ ఇలా చేయ‌డు.. నువ్వు మా హీరో కాదు.. ఫ్యాన్స్ ఆవేద‌న‌!

Update: 2021-03-20 18:30 GMT
ఫ్యాన్స్ దృష్టిలో హీరో ఎప్పుడూ ఎవ‌రెస్ట్ మీద‌నే ఉండాలి. అక్క‌డి నుంచి ఆయ‌న స్టార్ డ‌మ్ ఎక్క‌డ ప‌డిపోతుందోన‌ని వీళ్లంతా అనుక్ష‌ణం ఆందోళ‌న చెందుతుంటారు. అలాంటిది.. త‌మ హీరో వ్య‌క్తిత్వానికి మ‌చ్చ వ‌చ్చే ప‌రిస్థితి ఉంటే ఇంకేమైనా ఉందా..? డైహార్డ్ ఫ్యాన్స్ గుండెలు పగిలిపోతాయి! ఇప్పుడు.. షారూక్ ఖాన్ ఫ్యాన్స్ ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు!

బాలీవుడ్ బాద్షా గా ప్రేక్ష‌కుల మదిలో, అభిమానుల హృద‌యాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న షారూక్ ఖాన్‌.. ఫ్యాన్స్ నుంచి ఆవేద‌న‌తో కూడిన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్నారు. ఆయ‌న చేసిన ప‌నిని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇది చేసింది మా హీరోనేనా? అని తీవ్రంగా కలత చెందుతున్నారు. చివరకు ఇత‌ను మా షారూక్ కాదంటూ ట్విట్ట‌ర్లో భారీ స్థాయిలో ట్వీట్లు చేస్తున్నారు.

వారి మ‌న‌సుకు ఇంత బాధ‌క‌లిగించేలా షారూక్ చేసిన ప‌ని ఏమంటే.. ఆయ‌న పాన్ మ‌సాలాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నిల‌వ‌డ‌మే! ప్ర‌ముఖ గుట్కా కంపెనీ విమ‌ల్ ను ప్ర‌మోట్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు షారూక్‌. ఇందుకు సంబంధించిన యాడ్ లేటెస్ట్ గా ప్ర‌సారం అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. ఆపై ప్రేమ పూర్వ‌క నిర‌స‌న తెలియ‌జేస్తున్నారు.

#NotMySRK అనే హ్యాష్ ట్యాగ్ ను భారీగా ట్రెండ్ చేస్తున్నారు. అందులోని కామెంట్ ను కాపీచేస్తూ వేలాది ట్వీట్లు చేస్తున్నారు. ‘‘ప్రియమైన షారూక్ మీరు ఎంతో కాలం నుంచి క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రోగుల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు. అలాంటి మీరు క్యాన్సర్ వ్యాప్తికి కారణమైన గుట్కా ప్యాకెట్ కు ఎలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు? నేను హృద‌య‌పూర్వ‌కంగా చెప్ప‌గ‌ల‌ను మీరు నా షారూక్ కాదు’’ అంటున్న వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.

కాగా.. షారూక్ తండ్రి కూడా క్యాన్సర్ తో మరణించడం యాదృశ్చికం. అప్పుడు ఈ బాద్షా వ‌య‌సు కేవ‌లం 15 సంవ‌త్స‌రాలు. ఇవ‌న్నీ గుర్తు చేస్తున్న ఫ్యాన్స్‌.. షారూక్ గుట్కాను నోట్లో వేసుకున్న‌ట్టుగా చూప‌డాన్ని ఏ మాత్రం యాక్సెప్ట్ చేయ‌లేక‌పోతున్నారు. అయితే.. మ‌రికొంద‌రు అభిమానులు మాత్రం అది గుట్కా కాద‌ని, కుంకుమ పువ్వు ఉన్న ఇలాచీ మాత్ర‌మే అని చెబుతున్నారు. కాగా.. ఈ యాడ్ లో చాలా కాలంగా అజయ్ దేవ్ గన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
Tags:    

Similar News